Thursday 4 April 2013

మంచి డ్రెస్సే మాస్టారూ...!

టీచరుకు డ్రెస్ కోడ్ అవసరమా?

శిశువుకు ఆదిగురువు అమ్మే...

ఆ తర్వాత సర్వస్వం పాఠశాల ఉపాధ్యాయుడే. 

విద్యావ్యవస్థకు ఆదర్శవంత పునాదులేసిన గురుకులం

 ఆహార్యమూ ఆదర్శమే...

టీచరంటే చిన్నారికి కేవలం అక్షరాలు, అంకెలు నేర్పించడంతోనే సరిపోదు. ఆ గురువు నుంచి పసివారు ఎన్నో నేర్చుకుంటారు. టీచరు నుంచి విద్యార్ధికి విజ్ఞానం ఒక్కటే కాదు నడవడి, మాటతీరు, వస్త్రాలంకరణ అన్నీ అబ్బుతాయి. గురు సాక్షాత్ పరబ్రహ్మ: అంటారు. బ్రహ్మ బిడ్డకు ప్రాణం పోసి వదిలేస్తే గురుబ్రహ్మ విజ్ఞానం, వివేకం అందించి మనిషిగా తీర్చిదిద్దుతాడు. విద్యార్ధిని అత్యధికంగా ప్రభావితం చేసేది ప్రాథమిక పాఠశాల టీచర్లే. పిల్లలకు టీచరే మార్గదర్శి. బాలల జీవితానికి అక్కడే పునాదులు పడతాయి. అలాంటప్పుడు గురుతర బాధ్యతలున్న ఆ ఉపాధ్యాయులు ఆదర్శప్రాయంగా ఉంటే తప్పేమిటి?. మనం ఏరికోరి ఎంచుకున్న పవిత్రమైన వృత్తి కదా?.

ఈ టీచరమ్మ పిల్లలకు ఏ పాఠం చెప్తోంది?

ఆలస్యంగానైనా మేలుకున్నట్లే...

మన రాష్ట్రంలో ప్రాథమిక స్థాయిలో టీచర్లకు డ్రెస్ కోడ్ విధిస్తూ సర్కారు ఆదేశాలిచ్చింది. అన్ని స్కూళ్లలోనూ అమలయ్యేలా చూడాలని విద్యామంత్రి శైలజానాథ్ అధికారులకు సూచించారు. చాలా కార్పొరేట్ స్కూళ్లలో టీచర్లకు, విద్యార్థులకు డ్రెస్ కోడ్ అమల్లో ఉంది. ఇక క్లాస్ రూములో జీన్స్ ప్యాంటు, టీ షర్ట్స్ ధరించకూడదనేది సర్కారు ఉత్తర్వుల సారాంశం. గౌరవప్రదమైన వస్త్రధారణ ఉండాలనే నిబంధన విధించారు. ఆడవారు చీరా జాకెట్, మగవారు ప్యాంటూ షర్టు ధరించాలి. ఇరవయ్యేళ్లలోపులోనే ప్రభుత్వ టీచరుగా ఉద్యోగం వచ్చేస్తోంది.మండల, గ్రామ స్థాయిలో పోస్టింగులు ఇస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో చదువుకున్న యూత్ అలవాటుకొద్దీ జీన్స్, టీ షర్టులతో క్లాసురూముల్లోకి వెళ్తున్నారు. లేడీ టీచర్లు మినహాయింపేమీ కాదు. సల్వార్ కమీజులు వేసేవారూ ఎక్కువే. చీరలు కట్టుకునే వారి సంఖ్య అరుదు. హైస్కూలు, కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి. అయితే ప్రాథమిక పాఠశాలల్లో చిన్నారుల మీద ప్రభావం పడకుండా సర్కారు ఆలస్యంగానైనా మేలుకుంది. 

టీచర్లకు డ్రెస్ కోడ్ ఉండాలేమో...?!

గురువును పలుచన చేస్తున్న సినిమాలు

టీవీలు, సినిమాల పుణ్యమా అని లేతమనసుల్లోనే విషబీజాలు నాటుకుపోతున్నాయి. ఆదర్శంగా ఉండాల్సిన టీచర్లు కాలేజీ కుర్రాళ్లలాగా అసభ్యంగా, జుగుప్సాకరంగా డ్రెస్సులేసుకుని వస్తే ఇక ఆ పసివారికి మార్గదర్శకులుగా నిలిచేదెవరు?. గురువులే హుందాతనంతో మెలగపోతే పిల్లలకు విద్యాబుద్ధులు సక్రమంగా అందుతాయా?. సిటీ కల్చరంటూ తల్లిదండ్రులే చిన్నపిల్లలకు  పొట్టి దుస్తులు వేసి సంబర పడుతున్న విషయాన్ని తోసిపుచ్చలేం. అది వారి కర్మ. ఉపాధ్యాయ వృత్తికి ఇంకా మన సమాజంలో పవిత్రత మిగిలే ఉంది కాబట్టి ప్రాథమిక టీచర్లయినా ఆదర్శప్రాయంగా ఉండటం అవసరం.

కొంత మంచి... చాలా చెడు

సెల్ ఫోన్లతో ఎంతో చేటు...

మన రాష్ట్ర ప్రభుత్వం సెలఫోన్ల మీదా ఆంక్షలు విధించి చాలా మంచి పని చేసింది. క్లాస్ రూముల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లు తీసుకురాకూడదని నిబంధన పెట్టింది. మాయదారి మోబైల్ ఫోన్ వల్ల ఎన్ని పనిగంటలో వృధా అవుతుంటాయి. టీచర్లు బోధన మీద సరిగ్గా దృష్టి పెట్టలేరు. ఆ టీచర్ల మానసిక స్థితినీ సెల్ఫోన్లు ప్రభావితం చేస్తాయి. భావోద్వేగాలకు లోనయ్యే అవకాశం ఉంది. ఆ ఎఫెక్ట్ పిల్లల మీదే చూపిస్తారు.
కొన్ని స్కూళ్లలో సెల్ ఫోన్లతో అమ్మాయిలను అసభ్యంగా చిత్రీకరించడం వాటితో బ్లాక్ మెయిల్ చేయడం లాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి. ముఖ్యంగా రెసిడెన్షియల్ పాఠశాలల్లో టీచర్లకు ఈ జాడ్యం ఎక్కువ. అత్యవసర సమాచారం చేరవేతకు ఉపయోగపడాల్సిన సెల్ ఫోన్ టెక్నాలజీ  అభంశుభం తెలియని చిన్నారుల మీద 'నీలి'నీడలు పడేలా చేయడం సిగ్గుచేటు. 

డ్రెస్ కోడ్ అనగానే గురువులకు దిగులా?!

మిగతా రాష్ట్రాల్లోనూ డ్రెస్ కోడ్ 

మన రాష్ట్రంలోని ప్రైమరీ స్కూళ్లలో  ఇప్పుడు డ్రెస్ కోడ్ పెట్టారు గానీ అనేక రాష్ట్రాల్లో రెండు మూడేళ్ల క్రితం నుంచే ఉంది. డ్రెస్ కోడ్ వ్యవహారం కేరళలో మానవ హక్కుల కమిషన్ దాకా వెళ్లింది. టీచర్లు తప్పనిసరిగా ఓవర్ కోట్ ధరించాలని ఓ ఎయిడెడ్ స్కూల్ యాజమాన్యం ఆదేశించడంతో ఓ లేడీ టీచర్ ఇది హక్కుల ఉల్లంఘనేనంటూ హెచ్చార్సీని ఆశ్రయించింది. తమిళనాడు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ కూడా నిరుడు జులైలో డ్రెస్ కోడ్ సర్కులర్ జారీచేయడం దుమారం రేపింది. పవిత్రమైన వృత్తి కాబట్టి అందుకుతగినట్లు వస్త్రధారణ ఉండాలని జయలలిత సర్కారు ఉత్తర్వులివ్వడం వివాదంగా మారింది. అయితే మధురై కార్పొరేషన్ స్కూళ్లలో మహిళా టీచర్లకు చీరలు, పురుషులకు ఫుల్ హ్యాండ్స్ షర్టులు తప్పనిసరి చేశారు. మధ్య ప్రదేశ్ లోనూ టీచర్లకు వస్త్రధారణ నిబంధనలున్నాయి. విద్యాసంస్థల్లో ఫ్యాషన్ షోలను ఎప్పుడో నిషేధించారు. విద్యార్థినులు సల్వార్-కమీజ్, జీన్సు-టీషర్ట్ వేసుకోవడంపై ఆంక్షలున్నాయి. లేడీ టీచర్లు చీరలే కట్టుకోవాలనేది నిబంధన. ఒడిషాలో ప్రభుత్వం స్కూళ్లన్నింటిలో నిరుడు సెప్టంబరు నుంచే డ్రెస్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఆడ, మగ టీచర్లు యూనిపామ్స్ ధరించేలా సర్కారు చర్యలు తీసుకుంటోంది. పంజాబ్, మిజోరం సర్కార్లు కూడా ప్రాథమిక విద్యాలయాల్లో టీచర్లు ఆదర్శవంతంగా ఉండాలనే రూల్స్ విధించాయి.టీచరంటే పిల్లలకు పాఠం చెప్పడం ఒక్కటే కాదు వారిని సత్ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన పవిత్రమైన వృత్తి. ఆ పవిత్రతను కాపాడే బాధ్యతను తీసుకున్న గురువులందరికీ వేనవేల వందనాలు! 

1 comment:

Saahitya Abhimaani said...

Of late, somehow a new trend of reaction has come into vogue, may be in the last decade. People are not reacting to the actual work or statement. But people are reacting to the person who has done that or who suggested it. Appearing to be very innocuous reactions but highly prejudicial reactions are appearing now a days.

Gone are the days when a matter is discussed dispassionately.