Friday 19 April 2013

ఓ నియంత పరాభవానుభవం!

పర్వేజ్ ప్రజాస్వామ్యం ముసుగు!

ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారనేది పర్వేజ్ ముషారఫ్ కు తెలిసొచ్చింది. జూలుంటేనే అడవిలో సింహానికి విలువ. ఇప్పుడు ముషారఫ్ సాధు జీవిలా సరికొత్త మాస్క్ వేసుకుని ఎన్నికల గోదాలోకి దిగాడు. తనపై ఉన్న నియంత ముద్రను చెరిపేసుకుని ప్రజాస్వామ్య పాలకుడనిపించుకోవాలన్న ఆతృతలో ప్రత్యర్థి పక్షం ముందు బోల్తాకొట్టేశాడు ముషారఫ్. పాకిస్థాన్ను పదేళ్లు నియంతలా పాలించిన ఈ మిలటరీ జనరల్ ఇప్పుడు మళ్లీ రాజకీయ ముసుగేసుకుని దేశాన్ని ఉద్దరిస్తానంటూ వస్తే జనం నమ్ముతారా? అసలే శతృపక్షం ముప్పేటదాడికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయినట్లైంది. రాజకీయ వర్గాలు ఒకవైపు, న్యాయ వ్యవస్థ మరోవైపు, సైనిక సమూహాలు ఇంకో వైపు... ముషారఫ్ కు మూడు వైపులా ముప్పు పొంచి ఉన్నట్లే. నాలుగో వైపు మతచాంధస తీవ్రవాద మూకలు ఉండనే ఉన్నాయి.


నామినేషన్ల దగ్గరే బోల్తా

ఆ... ఏమవుతుందిలే  అనుకుంటూ స్వీయ ప్రవాస జీవితం ముగించి మళ్లీ పాకిస్థాన్లో అడుగు పెట్టిన క్షణం నుంచే అపశ్రుతులు. స్వాగత సన్నాహంగా కరాచీలో తన సొంత పార్టీ ఆల్ పాకిస్థాన్ ముస్లిం లీగ్ భారీ ర్యాలీ ఏర్పాటు చేస్తే పాకిస్థాన్ పాలకులు సెక్యూరిటీ పేరు చెప్పి అనుమతి ఇవ్వలేదు. ఆర్భాటంగా అడుగుపెదామనుకుంటే ఆదిలోనే గండికొట్టారు. మేలో జరిగే జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుని నాలుగు చోట్ల నామినేషన్లు వేస్తే న్యాయవ్యవస్థ పాత కేసులు తిరగతోడింది. ఒక్క నామినేషనూ ఓకే కాలేదు. ఇక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది.

ప్రవాసంలో పదనసలు...

దుబాయ్, లండన్, అమెరికాల్లో నాలుగేళ్లుగా ప్రవాస జీవితం గడిపినా ముషారఫ్ దృష్టి ఎప్పుడూ పాకిస్థాన్ రాజకీయాల మీదే. ఎలాగోలా గద్దెనెక్కేయాలనే ఉబలాటం. ఈదఫా ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్కాలని వ్యూహం పన్నినా ఫలించలేదు. చివరికి ఇస్లామాబాద్ హైకోర్టులో ముషారఫ్ పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా తయారైంది. బెయిల్ పొడిగించాలంటూ కోర్టుకొస్తే న్యాయస్థానంలో భంగపాటు ఎదురైంది. బెయిల్ ఇవ్వడం కుదరదంటూ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. ఎంతటి నియంతకైనా కొన్నిసార్లు దుర్లభ క్షణాలు తప్పవు. ముషారఫ్ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతో కోర్టు నుంచి పరుగందుకున్నాడు. ఒకప్పటి తిరుగులేని దేశాధ్యక్షుడికి ఇది మొదటి ఓటమి. ఇస్లామాబాద్ శివార్లలోని ఓ ఫామ్ హౌస్ లో తలదాచుకున్న 'నియంత'ను పోలీసులు, పారా మిలటరీ సిబ్బంది హౌస్ అరెస్ట్ చేశారు. ఏమీ పాలుపోని స్థితిలోనూ చివరి ప్రయత్నంగా ఆయన పార్టీ నాయకులు  సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడా పరాభవమే ఎదురైంది. ఆ తర్వాత అరెస్టు... రిమాండు మామూలే. తన మాటకు తిరుగులేదని విర్రవీగిన నియంతగా ఇంతకంటే పరాజయమేముంటుంది ?!

రగులుతున్న పాత పగలు

అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పరాయి పార్టీల నాయకులను నిర్ధాక్షిణ్యంగా అణచివేశాడు. సైన్యాన్ని గుప్పిట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని పరిహసించాడు. పోలీసు వ్యవస్థను తనకు బానిస సంస్థగా మార్చేసుకున్నాడు. చివరికి న్యాయవ్యవస్థకూ 'జీ హుజూర్' అనే ఏకాక్షర మంత్రం నేర్పించాడు. ఒకప్పుడు అందలం ఎక్కడానికి మెట్లుగా వాడుకున్న వ్యవస్థలే ఇప్పుడు అమాంతం కింద పడేసిన జారుడు బల్లలయ్యాయి.

వెంటాడిన దేశద్రోహం కేసు 

మిలటరీ పాలకుడి మీద ప్రత్యర్థులు పెట్టినది దేశద్రోహం కేసు. 2007లో దేశంలో అకారణంగా ఎమర్జన్సీ విధించి అరవై మంది న్యాయమూర్తులకు ఉద్వాసన పలికాడు ముషారఫ్. న్యాయవ్యవస్థలో చాలా మందికి ముషారఫ్ మీద పీకల్లోతు కోపముంది. అలాగే సైనికదళాల్లోనూ ముషారఫ్ మీద వ్యతిరేక భావం ఎక్కువైంది. అక్కడి ప్రజాస్వామ్యం మిలటరీ గుప్పిట్లోనే మనుగడ సాగిస్తోంది. రాజ్యాంగాన్ని మార్చేయగల సర్వాధికారం సైనిక దళాధిపతి దగ్గరుంటుంది. మిలటరీ ఉద్యోగిగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చిన ముషారఫ్ ఎకాఎకీ దేశాధ్యక్షుడై పోయాడంటే కారణమిదే.

ఉచ్చులోకి దింపింది కయానీ!

ముషారఫ్ వెనక్కి రావడమే ఆశ్చర్యకరమైన అంశం. నియంత వెనక్కి వస్తున్నాడంటే సైనిక దళాల అధిపతి కయానీ ఎలా అనుమతి ఇచ్చాడని అందరూ అనుకున్నారు. స్వీయ ప్రవాసం పేరుతో పరాయి దేశాల్లో విలాసాలు అనుభవిస్తున్న ముషారఫ్ ను ఎలాగోలా స్వదేశానికి రప్పించడానికి పెద్ద కుట్రే జరిగిందనిపిస్తోంది. ముషారఫ్  అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలు... ఎన్నో కేసులు. వాటన్నింటికీ దోషిని చేసి ముషారఫ్ ను బోనులో నిలబెట్టాలన్నది  పాలకుల దృఢసంకల్పం. ఒకప్పుడు ముషారఫ్ సాయంతో సైనికాధిపతి అయిన కయానీయే ఇప్పుడు గురువుగారిని తెలివిగా స్వదేశం రప్పించి ఎటూ పారిపోకుండా చేశాడన్నది విశ్లేషణ. కయానీ మతచాంధస జిహాదీ వర్గాలకు ఎంతో ఇష్టుడు. ముషారఫ్ మతనిష్ఠ లేని అమెరికా అనుకూల వాది. సైన్యాన్ని నమ్ముకుని వచ్చిన ముషారఫ్ ను సైనిక, న్యాయ వ్యవస్థలే రఫ్పాడిస్తున్నాయి. దేశద్రోహం కేసులో దొరికిపోయిన ముషారఫ్ కు ఇక ఊపిరి సలపకుండా చేసేందుకు నాలుగు వ్యవస్థలూ ఒక్కటయ్యాయి.

పాపాలు ఊరకేపోవంటారు...!

దేశద్రోహమొక్కటే కాదు... 2007లో మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో దారుణ హత్య కేసు, 2006లో బలూచీస్థాన్ వేర్పాటువాద నాయకుడు నవాజ్ అక్బర్ బుగ్తీని సైనిక దళాలు కాల్చిచంపిన కేసు లాంటివి కూడా ముషారఫ్ మెడకు చుట్టుకున్నాయి. కుట్రలు, కుతంత్రాలతో అందలం ఎక్కిన నియంతను ఇప్పుడు పట్టిబంధించారు. ఇస్లామాబాద్ కోర్టు నుంచి పారిపోయినంత సులువుగా దేశం విడిచి పరారవడం కుదరదనేది ఆయనకు ఇప్పటికే బోధపడి ఉండవచ్చు.

అధికార పీఠం ఎక్కడానికి కార్గిల్ తొలిమెట్టు

1999లో అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ ను అర్ధాంతరంగా పదవీచ్యుతుడిని చేసి పాకిస్థాన్ పగ్గాలు చేపట్టాడు ముషారఫ్. ఆనాడు కార్గిల్ అంశం బాగా ఉపయోగపడింది. పాకిస్థాన్లో సహజసిద్ధంగా ఉండే భారత వ్యతిరేక భావాన్ని రెచ్చగొట్టి పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకున్నాడు.  కార్గిల్ సరిహద్దుల్లో చొరబాట్లను ఎగదోసిన ముషారఫ్ సైనికాధిపతి హోదాలో భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చాడు. దౌత్యపరమైన ఈ ఉల్లంఘనలను, దురహంకారపూరిత పోకడలను ఈమధ్య కూడా సమర్ధించుకున్నాడు.

పొంచివున్న ప్రత్యర్థులు

ఒకప్పుడు నవాజ్ షరీఫ్ ను ముప్పుతిప్పలు పెట్టిన ముషారఫ్ ఇప్పుడు అదే అనుభవాన్ని ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం నవాజ్ షరీఫ్ విపక్షంలోనే ఉన్నా జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్ ను గెలిపించడానికి సైనికాధిపతి కయానీ శాయాశక్తులా తోడ్పాటునందిస్తున్నాడు. అటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్ చౌదురికి కూడా ముషారఫ్ విరోధి. 2007లో ఇఫ్తికార్ ను ముషారఫ్ తొలగించాడు. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే... రాజ్యాంగాన్నే తనకు అనుకూలంగా మార్చుకున్న ముషారఫ్ 2008లో ఎమర్జన్సీ విధించి ఇఫ్తికార్ సహా అరవై మంది న్యాయమూర్తులను ఇంటికి పంపించాడు. ఇప్పుడా ఇఫ్తికార్ ఎదురుగానే బోనులో నిలబడ్డాడు ముషారఫ్. పదేళ్ల పాటు హవాసాగించిన మిలటరీ పాలకుడు, ఆధునిక నియంత ముషారఫ్ 2008లో పార్లమెంటు అభిశంసించే ప్రమాదం ఉందని ముందే గ్రహించి దేశం విడిచి పారిపోయాడు. అయితే దానికి స్వీయ ప్రవాస జీవితం అనే ముద్దు పేరొకటి తగిలించాడు. ఇప్పుడు స్వదేశంలోనే ఫామ్ హౌస్ లో బతుకుజీవుడా అంటూ తలదాచుకుంటే పోలీసులు అరెస్ట చేసి తీసుకువెళ్లారు.

నియంతలకే నియంత

పాకిస్థాన్ కు నియంతల పాలన కొత్త కాకపోయినా ముషారఫ్ నియంతల్లోకెల్లా నియంత. అంతకుముందు 1958లో అయూబ్ ఖాన్ సైనిక తిరుగుబాటు ద్వారా గద్దెనెక్కాడు. 1977లో జియా ఉల్ హక్ ప్రభుత్వాన్ని కూల్చేసి నిర్బంధంగా పాలనా పగ్గాలు చేబట్టాడు.  1999లో ముషారఫ్ కూడా సైనిక తిరుగుబాటుతో నవాజ్ షరీఫ్ సర్కారును గద్దెదింపేసి ప్రెసిడెంట్ అయ్యాడు. పాకిస్థాన్ చరిత్రలో ఆరుగురు అధ్యక్షులు వివిధ పార్టీలకు చెందిన  నాయకులు. ఇందులో నలుగురు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ వారే. నలుగురు అధ్యక్షులు మిలటరీ అధికారులు. ఇందులో ముగ్గురు సైనికకుట్రతో గద్దెనెక్కారు. అయితే మిగతా ముగ్గురూ తమ పాలన ముగిశాక మళ్లీ అధికార పీఠం వైపు చూడలేదు. ముషారఫ్ మాత్రం అలాకాదు... జరిగినన్నాళ్లూ నియంతలా పాలించాడు. టైం బాగోనప్పుడు తోకముడిచి ప్రవాసం అన్నాడు. ఇప్పుడు ఎన్నికలవేళ రాజకీయ నాయకుడి అవతారమెత్తి ప్రజాస్వామ్యం ముసుగేసుకుని మళ్లీ దేశంలో అడుగుపెట్టాడు. అందుకే ప్రత్యర్థులకు అంత ఒళ్లుమంట!

2 comments:

kvsv said...

అధికారం లో ఉన్నపుడు విర్ర వీగి...దోపిడీ.. అవినీతులతొ..నియంతల్లా విర్ర వీగి..ఇలా హత్యా రాజకీయాలు...ఎదుటి పక్షాలను మట్టిలో కలిపేయాలనుకున్న వాళ్ళెంతోమంది...పరాభవాలు ఎదుర్కోక తప్పదు..అన్నిటి కంటే భగవంటుడు మరింత భయంకరమైన శిక్ష వేయడం చూశాం గా...

nihar said...

kvsvగారు స్పందించినందుకు కృతజ్ఞతలు.... నియంత ప్రజాస్వామ్యం ముసుగేసుకోవడమంటే తడిగుడ్డతో గొంతుకోసే ప్రయత్నం చేయడమే. పాకిస్థాన్ ప్రజలు ఈ నిజాన్ని గుర్తించాలని ప్రార్ధిస్తున్నాను- నిహార్