Saturday 6 April 2013

భళే రుచిగా 'విషం' పండ్లు!

ఈ పండ్లు తింటే అనారోగ్యమే!
పసుపు పచ్చగా నిగనిగలాడింది కదాని ఆరోగ్యకరమైన మామిడి పండనుకోవద్దు. ఎర్రగా కనిపించేది నాణ్యమైన యాపిల్ కాకపోవచ్చు. ఎర్రరంగు నీళ్లెక్కించిన కర్బూజాలు, రసాయనాల్లో మాగబెట్టిన అరటిపళ్లు మనం తిటున్నాం. జీర్ణకోశ వ్యాధులు, క్యాన్సర్, శ్వాసకోశ రోగాలను కొనితెచ్చుకుంటున్నాం.

కాలమొస్తే కాయే పండుతుంది

చెట్టు మీద కాయ పండేందుకు సహజసిద్ధమైన ప్రక్రియ ఉంది. సీజన్ను బట్టి వేసవిలో మామిడి, శీతాకాలంలో యాపిల్ కాస్తుంటాయి. చెట్టు కూడా కాలానుగుణంగా వాతావరణం, ఉష్ణోగ్రత, గాలిలో తేమ ఆధారంగా ఎప్పుడే పని చేయాలో తెలుసుకుంటుంది. కాయలు పండయ్యే సీజన్  వచ్చిందటే చెట్టు దానంతటదే ఇథెలీన్ తయారు చేసుకుని మొత్తానికి సరఫరా అయ్యేలా చూస్తుంది. ఇథెలిన్ కాయలోకి చేరగానే అందులోని కణజాలానికి సంకేతాలు వెళ్తాయి. దీంతో కాయలోని కణాలు ఎంజైమ్ తయారుచేసి,  పిండిపదార్ధాన్ని చక్కెరగా మార్చేస్తాయి. కాయ చర్మంలోని కణజాలం పిగ్మెంటేషన్ ద్వారా రంగు మారుతుంది. అంటే పండుకు అసలుసిసలు రంగు వచ్చేస్తుంది. కానీ ఈ ప్రక్రియేదీ జరగకుండానే కాయగా ఉండగానే రైతులు కోసేసి మార్కెట్లుకు తరలిస్తారు. వ్యాపారులు రసాయనిక పద్ధతుల్లో వాటిని పండించేసి అమ్మేస్తుంటారు. మనం కొనేసుకుని తినేస్తుంటాం. ఈ పండ్లు తింటే ఆరోగ్యం కాదు అనారోగ్యం వస్తుంది.

విషరసాయనాలతో....

పండ్లు చెట్టు మీద సహజసిద్ధంగా పండితేనే రుచి, సువాసన, పోషకవిలువలు, ఆరో్గ్యం. కానీ ఏ పండూ సహజసిద్ధంగా పండటం లేదు. అన్నీ మార్కెట్లలో కృత్రిమంగా మగ్గబెట్టినవే. అంటే ప్రమాదకర రసాయనాల్లో ముంచి తీస్తున్నారన్న మాట. మనకు తెలియకుండానే 'విషం పండ్ల'ను ఆరగిస్తున్నాం. తక్షణమే ఏ ప్రమాదమూ రాకపోవచ్చు. రోగ లక్షణాలు నెమ్మదిగా బయటపడుతుంటాయి. 
 బుట్టలో పండ్లన్నీ ఒకేరంగులో ఉంటే...
సాధారణంగా పండ్లు త్వరితగతిన మగ్గేందుకు 'ఇథెఫాన్'( 2-క్లోరోఇథైల్ ఫాస్పరిక్ యాసిడ్) వాడుతుంటారు. ఈ రసాయనం కాయలోకి చేరి ఇథెలీన్ గా  రూపాంతరం చెందుతుంది. దీంతో కాయ రంగు మారి పండులా కనిపిస్తుంది. కాల్సియం కార్బైడ్(సీఏసీ2) (ఎసటిలీన్, ఇథెలీన్ తయారవుతాయి)ను కూడా పండ్లు మాగబెట్టేందుకు వినియోగిస్తున్నారు. ఇలా కృత్రిమంగా పండిన వాటి చర్మం రంగు ఒకేలా ఉంటాయి. టొమాటో, మామిడి, బొప్పాయి, అరటి... బుట్టలోని పండ్లన్నీ ఒకే రంగులో ఉన్నాయంటే ఫ్రూట్ రైపెనింగ్ ఏజెంట్ వాడినట్లే లెక్క. ఇలా కృత్రిమంగా పండినవి సహజమైన రుచి, సువాసన కోల్పోతాయి. పోషక విలువలూ తగ్గిపోతాయి. పండు నిల్వవుండే కాలం తగ్గిపోయి త్వరగా పాడైపోతాయి. పండ్ల తోటలు, కూరగాయల మొక్కల మీద రైతులే ఇష్టానుసారం ఎరువులు, పురుగుమందులు జల్లుతుంటారు. కాయల మీదా ఇవన్నీ పోగుబడతాయి. హానికరమైన రసాయనాలన్నీ ఉన్న వాటిని మరింత విషపూరితం చేసేలా కృత్రిమంగా పద్ధతిలో పండ్లుగా మారుస్తున్నారు.

ఇథెలీన్ - న్యూరోలాజికల్ సిస్టమ్ దెబ్బతింటుంది. కళ్లు, చర్మం, ఊపిరితిత్తుల మీద ప్రభావం ఉంటుంది. జ్ఞాపకశక్తి కూడా మందగించవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ డ్యామేజ్ అయితే హైపోక్సియా(దీర్ఘకాలం సరిగ్గా ఆక్సిజన్ అందకపోవడం) ప్రమాదం కూడా ఉంటుంది.
ఇథెఫాన్ -  తోటల్లో మొక్కల ఎదుగుదల క్రమబద్ధంగా ఉండేలా వాడే రసాయనం. యాపిల్స్, చెర్రీస్ చెట్టు మీదే పక్వానికి వచ్చి రంగు తేలడానికి పిచికారీ చేస్తారు. కాప్సికమ్ మంచి రంగులోకి మారేందుకు వాడుతుంటారు.

డేంజర్ మెథడ్స్

కాయలను గాలిసోకేలా చెక్క పెట్టెల్లో ఉంచి  ఆ గదిలో మంట ద్వారా ఇథెలీన్, ఎసిటిలీన్ వాయువులు వెలువడేలా చేస్తుంటారు. దీంతో ఆ పొగకు కాయలు ఇట్టే పండిపోతాయి. మామిడి, బత్తాయి, నారింజ, సపోట, యాపిల్, కర్బూజ, దానిమ్మ, నిమ్మ... ఇలా అనేక రకాల పండ్లు నిగనిగలాడుతూ ఒకేరంగులోకి మారిపోతుంటాయి.

మామిడికి కార్బైడ్ రంగులు

మామిడిపండ్లను చీకటిగదుల్లో కుప్పగా పోసి అందులో కాగితంలో చుట్టిన కాల్షియం కార్బైడ్(సీఏసీ2) ముక్కలు ఉంచుతారు. గది ఉష్ణోగ్రత, తేమతో వేడి ఆవిరులు వెలువడి మామిడి కాయల చర్మం పసుపురంగులోకి మారిపోతుంది.

కుళ్లు కెమికల్స్ తో పండిన అరటి 

అరటి గెలలను పెద్దపెద్ద డ్రమ్ముల్లో రసాయనాలు కలిపి అందులో నానబెడతారు. ఆ కుళ్లునీళ్లలోంచి తీసిన పండ్లను కనీసం కడగకుండానే తినేస్తుటాం. తొక్కతీసేసి లోపలి గుజ్జే కదా తినేదనుకుంటాం. కానీ అరటి పండ్ల గోదాముల్లో డ్రమ్ములను చూస్తే జీవితంలో ఆ పండు జోలికే వెళ్లరు. ఇక పగుళ్లున్నపండ్లైతే లోపలంతా రసాయనం నిండి ఉంటుంది.

యాపిల్ కు కృత్రిమ రంగులు

యాపిల్ ఎర్రగా ఆకర్షణీయంగా కనిపించడానికి రసాయనం పూత పూస్తుంటారు. నాసిరకం పండ్లకు కూడా కంపెనీల స్టిక్కర్లు అంటించి మార్కెట్ చేయడం ఈమధ్య ఎక్కువైంది. రంగుకన్నా పండు రకం, నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తే మంచిది.

పుచ్చకాయ పొట్టనిండా రంగే

వేసవిలో అత్యధికంగా అమ్ముడయ్యేది పుచ్చకాయ. కోయగానే ఎర్రగా కనిపించేందుకు రంగు నీళ్లు ఇంజెక్ట్ చేసే అక్రమ పద్ధతులున్నాయి. అయితే ఇవి ఓ సైజు దాకా పెరిగితేనే కోస్తారు కాబట్టి సహజంగానే పండిపోతాయి. కృత్రిమ పద్ధతుల్లో పండించాల్సిన అవసరం చాలా తక్కువ. దానిమ్మలోకీ ఇలాగే రంగు ఇంజక్ట్ చేస్తారు. అందుకే గింజలు అంత ఎర్రగా మారుతాయి. హైబ్రీడ్ దానిమ్మ ఓ మోస్తారు ఎర్రగా ఉన్నా అన్ని రకాల కాయలకూ అంత రంగు వచ్చే అవకాశం లేదు.

ద్రాక్ష గుత్తుల్లో కెమికల్స్

ద్రాక్ష తోటల్లో చీడపీడల నివారణకు పురుగుమందులు పిచికారీ చేస్తారు. కాపు ఎక్కువగా ఉండేందుకు రసాయనాల వినియోగం తప్పదు. అందుకే పండ్ల నిండా తెల్లని పొడి కనిపిస్తుంటుంది. వీటిని జాగ్రత్తగా శుభ్రం చేయకపోతే అనారోగ్యం బారిన పడతాం.   

ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

  • పండ్లు, కూరగాయలను తప్పనిసిగా ఫ్లోటింగ్ వాటర్లో కడగాలి. 
  • ఫోర్స్ గా వచ్చే పంపు కింద పెడితే  విషరసాయనాలు కొంతైనా దూరమవుతాయి. 
  • టేబుల్ స్పూన్ ఉప్ఫు లేదా కొద్దిగా నిమ్మరసం కలిపిన నీటిలో శుభ్రం చేస్తే మంచిది. 
  • ఐదు నుంచి పది నిమిషాల పాటు నీళ్లలో మునిగేలా ఉంచాలి. 
  • మంచి నీళ్లతో కడిగి పొడిగా తుడిచాకే తినాలి.
    పండ్లు, కూరగాయలకు పగుళ్లున్నా, దెబ్బతగిలినా తినకూడదు. 
  • కుళ్లిపోయినా, రసాయనాలు పొడిరూపంలో కనిపించినా వాటి జోలికి వెళ్లవద్దు. 
  • పగుళ్లతో రసాయనాలు పండ్ల లోపలికి వెళ్తే ఆరోగ్యానికి ఎక్కువ ముప్పు.


 

No comments: