Thursday 18 April 2013

ఓట్లు రాలుకాలం...!

రామా... కనవేమిరా...?!

రామరాజ్యం అంటే ప్రజా సంక్షేమం. ధర్మబద్ధమైన పాలన. పన్నుల వడ్డనలేని రాజ్యం. ధనికుడు మరింత ధనికుడు, పేదవాడు మరింత పేదవాడుగా మారిపోయే పరిస్థితులకు తావులేని సమసమాజం. మనదేశంలో చిన్నా చితకా ఏడున్నరవేల సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయి. అయినా సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా అశాంతి. ప్రజలు సంతృప్తి చెందడంలేదా... పాలకులే విఫలమవుతున్నారా... ?. ఏటా లక్షల కోట్లు సంక్షేమం పేరుతో గుమ్మరిస్తున్నాయి మన ప్రభుత్వాలు. ఇంత డబ్బు ఏమయిపోతున్నట్లు...?. రామరాజ్యం ఎప్పటికైనా వస్తుందనేది ఉట్టి భ్రమేనా...?. నేటికి ఏనాటికీ ఆకలి రాజ్యమేనా...?!


'పని'లేకపోతే సమస్యే...

మనిషి బతకాలంటే ఉపాధి కావాలి.  అంటే సంపాదనా మార్గం ఉండాలి. అందుకు ప్రభుత్వం ఉద్యోగావకాశమైనా ఇవ్వాలి. లేదంటే స్వయంగా ఉపాధి పొందేందుకు మార్గమైనా చూపించాలి. సుమారు ఏడు దశాబ్ధాల స్వతంత్ర భారతదేశంలో ప్రధాన సమస్య నిరుద్యోగం. అసలు నిరుద్యోగం సమస్యే కాదు... మన విద్యార్థుల్లో నైపుణ్య స్థాయి తక్కువగా ఉండడమే అసలు సమస్య అని విశ్లేషించారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ఎలివేట్ అవుతున్న రాహుల్ గాంధీ. నైపుణ్యమెందుకు లేదంటే మన యూనివర్సిటీలు బోధిస్తున్న విద్యంతా డొల్లేనంటారాయన. పరిశ్రమలకు అవసరమైన స్కిల్స్ విద్యార్థుల్లో పెంపొందించాలి. అందుకు యూనివర్సిటీలు, పరిశ్రమలు అనుసంధానంగా పనిచేస్తూ విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. విద్యావ్యవస్థ సంస్కరణలనే అంశం చాలా విస్తృతమైంది. కార్మికులకు ఉపాధి కావాలి. యువతకు ఉద్యోగం కావాలి. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడాలంటే ఏదో ఊతం కావాలి. పథకాలైతే ఉన్నాయి. ఫలితాలెందుకు ఆశాజనకంగా ఉండడం లేదన్నది సందేహం.

 కరువు చూపిన ఉపాధి మార్గం

మనదేశంలో అమలవుతున్న ఉపాధి హామీ పథకం(ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీం) సుమారు నాలుగు దశాబ్దాల నాటిది. ఇందులో ఎన్నో వైపల్యాలున్నాయి. మొదట మహారాష్ట్రలో ఈ పథకం అమలు చేశారు. 1972లో మహారాష్ట్రలో కనీవినీ ఎరుగని కరువు పరిస్థితులు వచ్చాయి. ఈ ఏడాది కూడా ఆ రాష్ట్రంలో తీవ్రమైన కరువు తాండవిస్తోంది. ప్రపంచంలో... చివరికి కమ్యూనిస్టు పాలిత దేశాల్లోనూ లేనివిధంగా ఉపాధి హామీ పథకాన్ని డిజైన్ చేశారు.  పేదలకు రోజు గడిచేలా ఉపాధి చూపించడమే దీని లక్ష్యం. క్షామపీడిత ప్రాంతాల్లో రోడ్లు, చెరువులు, సాగునీటి కాలువలు తదితర మౌలిక సదుపాయాలు ఏర్పడేలా పనులు చేపట్టాలనేది ఆశయం. దీనివల్ల గ్రామాల్లో సౌకర్యాలు పెరుగుతాయి. రెండోది అక్కడి వారికి ఉపాధి మార్గం ఉంటుంది. ఈ పథకం మొదట సత్ఫలితాలనే సాధించింది. అనేకానేక దేశాల వారు దీనిపై అధ్యయనాలు జరపడానికి వచ్చేవారుట. దీన్నే ఆ తర్వాత మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద అమలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో రకరకాల పేర్లతో ఇలాంటి పథకాలే ఉన్నాయి. అయితే ఇలాంటి ఉపాధి గ్రామీణ ప్రాంతాల్లో సరికొత్త సామాజిక సమస్యలు తెచ్చిపెడుతోంది. ప్రభుత్వం ఇస్తున్న డబ్బంతా కాంట్రాక్టర్లు, అధికారులు, నాయకులు(వాటాల్లో ఈ మూడు ఘటాలు ముందూ వెనకా ఉండవచ్చు!) కలిసి పంచేసుకుంటున్నారనేది జగమెరిగిన సత్యం. కొద్ది మందికి ఉపాధి లభిస్తోంది. కొన్ని చోట్ల ఏ పనీ చేయకుండానే నాలుగు డబ్బులు చేతికందుతుండడంతో వ్యవసాయ రంగానికి కూలీలు దొరకని సంక్షోభం తలెత్తుతోంది. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బుతో ఎంత మందికి నిజమైన ఉపాధి కల్పిస్తున్నామనేది ఏ ప్రభుత్వాలూ చెప్పలేని పరిస్థితి.

కూడుపెట్టని సంక్షేమ పథకాలు

మనదేశంలో మనిషి ఆకలి తీర్చే పథకాలకూ లెక్కలేదు. ఎన్టీ రామారావు  హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలకు జనాకర్షణ  బ్రాండు వేసింది. ఎన్నికల్లో ఓట్లు రాల్చే పథకాల్లో ఇదొకటి. ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు రూపాయికే కిలో బియ్యం అందిస్తోంది. ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో పప్పూ ఉప్పూ లాంటి మిగతా వస్తువల మాటెమిటని అడగకుండా ఓ ప్యాకేజీ స్కీం కూడా ఈమధ్యే మొదలైంది. ఈ పథకం పేదల సంక్షేమం కోసమేనా.... లేదంటే ప్రజాధనం వృధా అవుతోందా.... అనే రెండు ప్రశ్నలపై ప్రజాభిప్రాయం సేకరించాల్సిన అవసరం ఉంది. 

కామరాజ్ పెట్టిన మధ్యాహ్న భోజనమే...

తిండంటే గుర్తొచ్చింది... స్కూలు పిల్లల కోసం తమిళనాడు ప్రభుత్వం మొట్టమొదట మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. 1960లో కె. కామరాజ్ సర్కారు ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు చాలా ఉపయోగపడింది. ఆ తర్వాత 1982లో ఎంజీ రామచంద్రన్ ప్రభుత్వం మరికొన్ని మార్పులతో దీన్ని ప్రజారంజకంగా మార్చింది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి తోడ్పడిన స్కీమ్ ఇది. 2001లో సుప్రీంకోర్టు కూడా ఓ కేసులో డైరెక్టన్ ఇవ్వడంతో చాలా రాష్ట్రాలు మధ్యాహ్న భోజన పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చాయి. 

 జయ ఇడ్లీ భలే రుచిట!

ఇప్పుడు తమిళనాడులో జయలలిత సర్కారు రూపాయికే ఇడ్లీ పథకం తీసుకువచ్చింది. చెన్నై సహా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వమే హోటళ్లు నిర్వహిస్తూ చౌక ధరలకు ఇడ్లీ, వడ, ఉప్మా లాంటివి అందిస్తోంది. పేదలు, కూలీల ఆకలి  తీరుస్తున్న పథకమిది. చెన్నైలోనే రోజూ రెండు లక్షలకు పైగా ఇడ్లీలు అమ్ముడవుతున్నాయంటే ఎంత మంది పేదలు సర్కారు పథకంతో పొట్ట నింపుకుంటున్నారో అర్థమవుతోంది. ఎన్టీ రామారావు హయాంలో హైదరాబాద్ లోనూ ఇలాగే చౌకగా ఆహార పదార్ధాలు అందించే జనతా హోటళ్లను ప్రారంభించి కొద్దికాలంలోనే ఎత్తేశారు.

మన ఆరోగ్యశ్రీతో మంచి ఫలితం

మనిషికి కావాల్సినవి తిండి, చదువు, ఉపాధి, ఆరోగ్యం. ఆరోగ్యం విషయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సర్కారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకం బహుళ జనాదరణ పొందింది. అలాగే 108 సర్వీసు కూడా జనానికే మంచి చేసింది. అయితే ఆరోగ్యశ్రీ పథకం అమల్లో పబ్లిక్, ప్రయివేట్ భాగస్వామ్యం వల్ల కార్పొరేట్ ఆస్పత్రుల ధనదాహం ఈ పథకంలోని సదుద్దేశాన్ని నీరుగార్చేసిందన్నది సత్యం. ప్రజలందరికీ ఆరోగ్యభద్రత కల్పించాల్సిన బాధ్యత సర్కారుది. అంటే అందరికీ ఆరోగ్య బీమా ఉండాలి. కానీ పాలకులు ఇలాంటి విషయాలనే ఎందుకో నిర్లక్ష్యం చేస్తుంటారు. కేంద్ర కార్మిక సంక్షేమ శాఖ రాష్ట్రీయ స్వాస్త్య బీమా యోజన పేరుతో ఐదేళ్లుగా ఓ స్కీం నడుపుతోంది. దారిద్య్ర రేఖకు దిగువనున్న సుమారు మూడుకోట్ల మందికి స్మార్ట్ కార్డులిచ్చారు. ఈ కార్డున్న వారు ఎక్కడైనా ఉచిత వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుంది. ఈ పథకం బాగా పనిచేస్తోందని గుర్తించిన ఐక్యరాజ్య సమితి దీన్ని ఇన్నోవేటివ్ కేస్ స్టడీ కింద తీసుకుంది. జర్మనీ సర్కారు కూడా తమ స్కూలు పిల్లల కోసం ఇలాంటి బీమా పథకాన్ని అమలు చేయడానికి మనదేశం సహకారం కోరిందిట. మన సంక్షేమ పథకాలు దేశవిదేశాల్లో ప్రాచూర్యం పొందుతున్నాయి. ఎన్నికల వేళ సరికొత్త ఆకర్షణీయమైన సంక్షేమ పథకాలు ప్రకటించే పార్టీలకు ఓట్లు పడుతున్నాయి. కోట్లకు కోట్లు ప్రజాధనం ఖర్చవుతోంది. అయినా ఎవరిని కదిపినా మొదట వినిపించే పదం "ఆకలి"!. పేదరికం లేని సమసమాజం వస్తుందని ఆశించే జనం గోడు కనవేమిరా... రామా?! 

No comments: