నేరగాళ్లను ప్రజలకు అప్పగిస్తేనే...!
దుష్టసంహారం చేయాల్సింది మనిషే!
అత్యాచారాలకు పాల్పడే వారిని జైళ్లకు పంపించడం కాదు...జనానికి అప్పగించాలన్న బిగ్ బి అమితాబ్ బచ్చన్ సూచనకు వంద మార్కులు పడతాయి. అవును పోలీసులు, చట్టాలు. న్యాయాలు ఏమీ చేయలేనప్పుడు రాక్షస సంహారం చేయాల్సింది ప్రజలే.
గత యుగాల్లో మాదిరిగా మహావిష్ణువు పదకొండో అవతారం ఎత్తే తరుణం ఈ కలియుగంలో రానేరాదు. ఏ మహానుబావుడో దుష్టసంహారానికి కంకణం కట్టుకుంటాడని ఆశించడం అవివేకమే అవుతుంది. మహిళలను, ఆడపిల్లలను చిదిమేస్తున్న మదమెక్కిన మగాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. ఏళ్ల తరబడి విచారణలతో కాలయాపన చేసే న్యాయవ్యవస్థలు నేరగాళ్లకు ముకుతాడు వేయగలవా...?. అవినీతి, అక్రమార్జనలతో జేబులు నింపుకునే పోలీసు వ్యవస్థ నేరాలను నిలువరించగలదా...?. అంతా అయ్యాక... అన్యాయం జరిగాక మొసలి కన్నీళ్లు కార్చే ఓదార్పు నాయకులు ఈ దుష్టకాండకు అంతం పలకగలరా...? వీళ్లెవరూ చేయలేని పనిని జనం చేయగలరు.
మన భద్రత మన చేతుల్లోనే....
మనచుట్టూనే మృగాళ్లున్నారు. కాబట్టి సదా అప్రమత్తంగా ఉండాలి. మన బిడ్డలను పిల్లల కోడిలా కనిపెట్టుకుని ఉండడం మన తక్షణావసరం. ఏమాత్రం ఏమరపాటుతో ఉన్నా తన్నుకుపోయేందుకు డేగలు కాచుక్కూర్చున్నాయి. కారడివికి వెళితేనే ఏ పులో మీదపడే ప్రమాదం ఉంటుంది. తుప్పల్లోకి అడుగుపెడితేనే ఏ పామో బుసలుకొట్టే అవకాశం ఉంది. కానీ మనుషులు తిరిగే జనారణ్యంలో ఒకటి రెండూ కాదు వేలకువేల మృగాలు. నరరూపంలో తిరుగాడుతున్న క్రూరాతిక్రూరమైన రాక్షసులు. మనం జాలిదలచి నీడనిచ్చిన మనిషే తోడేలు రూపంలోకి మారిపోవచ్చు. మనం పాపమనుకుని పట్టెడు అన్నం పెడితే కడుపునిండిన మనిషే ఎలుగుబంటిలా వికటాట్టహాసం చేయవచ్చు. పిల్లాపెద్దా తేడా లేదు. పాపల నుంచి పండు ముదుసలి దాకా... మహిళలకే రక్షణలేని సమాజంలో మనం బతుకుతున్నాం.
ఎందరు నిర్భయలో...
ఢిల్లీలో నిరుడు డిసెంబర్లో ఓ నిర్భయ నిర్జీవమైపోయింది. ఈ దారుణ మారణకాండతో తర్వాత సభ్యసమాజం సిగ్గుతో తలదించుకుంది. భారతదేశంలోనూ ఇంతటి ఘోరాలు జరుగుతున్నాయేమిటంటూ దేశవిదేశాల్లో అందరూ ముక్కునవేలేసుకున్నారు. పవిత్ర భారతావని అంటే ఇంతకాలం... వేదాలు, యోగాలు, ధ్యానాలు, యాగాలు, రుషులు, మంత్రాలు, జపాలు, తపాలు, శ్లోకాలు అనుకున్న అంతర్జాతీయ సమాజం 'ఛీ' అంటూ ఈసడించుకునే దురవస్థకు దిగజారిపోతున్నాం. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే నేల మీద కామాంధులు స్వైరవిహారం చేస్తున్నారన్న పతాక శీర్షికలు రోతపుట్టిస్తున్నాయి. మహిళలను పూజించే మన నేల మీద దేవతలు తిరుగుతుంటారని విశ్వసించే వారంతా వర్తమాన సమాపు విపరీత, విషపూరిత పోకడలు చూసి విస్తుపోయే పరిస్థితి. రోజూ అత్యాచారాలు. అఘాయిత్యాలు, కిడ్నాపులు, హత్యలు జరుగుతున్నాయని తెలిశాక మన దేశం పరువు మంటగలిసిపోకుండా ఉంటుందా ?.
పాపం చిన్నారి....
నిర్భయకు జరిగిన అన్యాయం మరే మహిళకూ జరగకూడదంటూ జనమంతా గొంతెత్తి నినదించింది. న్యాయస్థానాలు పోలీసు వ్యవస్థకి చీవాట్లు పెట్టాయి. చట్టసభలు కోరలు లేని పాత చట్టాలను పదునుపెట్టాయి. అయినా అవే ఘటనలు పునరావృతమవుతున్నాయి. అదే ఢిల్లీలో ఐదేళ్ల చిన్నారిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేశాడు ఓ రాక్షసుడు. చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటుండగా అదే భవనంలో సెల్లారు గదిలో వారం క్రితమే అద్దెకు దిగిన బీహారీ కామాంధుడు అపహరించాడు. అక్కడే నిర్బంధించి అత్యాచారం చేసినా ఇరుగు పొరుగూ ఎవరూ గుర్తించలేకపోయారుట. ఇంతకీ ఆ యువకుడి మంచీచెడూ తెలుసుకోకుండానే అద్దెకెలా ఇచ్చారన్నది ప్రశ్న. మన ఆవరణలో ఏం జరుగుతోందన్న స్పృహ కూడా లేకుండానే బతికేస్తున్న ఈ జనాన్ని ఏమనాలన్నది సందేహం. ఓ పసిబిడ్డను అపహరించి అక్కడే నిర్బంధించి అమానుషంగా అత్యాచారం జరుపుతున్నా చుట్టుపక్కల వారు ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఎందుకుండిపోయారో.
రాక్షసులకు ఆశ్రయమిస్తే...
మహబూబ్ నగర్లోనూ ఇలాంటి ఘటనే. ఉద్యోగం ఇచ్చిన యజమాని బిడ్డనే కాటేశాడో రాక్షసుడు. అంటే తన దగ్గర పనిచేసే ఉద్యోగి మీద సరైన నిఘా పెట్టకపోవడం వల్ల ఎంతటి నష్టం జరిగిందో చూశారా... ?. ఆమధ్య హైదరాబాద్లో తల్లి చంకలో ఉన్న బిడ్డను అపహరించుకుని వెళ్లారు దుండగులు. ఇంతకీ చేసిందెవరంటే... ఆ తల్లికి ఒకప్పటి సహోద్యోగి ఘనకార్యమట!. అత్యాచారాలు, అపహరణల కేసుల్లో సగానికిపైగా తెలిసిన వారే తెలివిగా మాటేసి, కాటేస్తున్నారనది తేలింది. అంటే మనం ఎవరినీ చేరదీయడానికి లేదు. చేరదీసినా ప్రతి కదలికనూ జాగ్రత్తగా గమనించాల్సిందే!. మన జాగ్రత్తలో మనం ఉన్నాం కదాని దీమాగా ఉండే పరిస్థితి లేదు. మన జోలికి ఎవరొస్తార్లే అన్న ఏమరుపాటూ పనికిరాదు. మనవారిని మనమే కాపాడుకోవాలి. మన తల్లిని, భార్యని, అక్కని, చెల్లిని, బిడ్డనీ... మనచుట్టూ ఉండే మన ఆడబిడ్డలకు మనమే రక్ష.
3 comments:
నిజంగా అలా జరుగుతుందా? బాగా రాశారు
Good post
తెలుగమ్మాయి గారికి, వనజా వనమాలి గారికి.... కృతజ్ఞతలు. ఇలాంటి పైశాచిక ఘటనలకు బ్రేక్ పడాలని ఆశిద్దాం- నిహార్
Post a Comment