Sunday 6 April 2014

యవ్వనంలో మోడీ హిమాలయాలకు ఎందుకు వెళ్లాడు...!


పదహారేళ్ళ ప్రాయంలో నరేంద్ర మోడీ హిమాలయాలకు ఎందుకు వెళ్లాడు...! ఆ తర్వాత రెండేళ్లకు తిరిగి ఇంటికి వచ్చినా.. మళ్ళీ  మానస సరోవరయాత్రకు ఎందుకు బయలుదేరాడు..!



     యుక్తవయసులో ఉన్న కుమారుడు ఇలా హిమాలయాలు పట్టుకుని వెళ్తానంటే ఏ తల్లయినా ఊరుకుంటుందా..! కానీ మోడీ  తల్లిదండ్రులు సరేనన్నారు. ఐదుగురు బిడ్డల్లో మూడో వాడైన మోడీ పదహారేళ్ళకే ఓ సన్యాసి తరహాలో యాత్రకు బయలుదేరితే వద్దనకుండా ఆశీర్వదించి పంపించారు. ఎందుకంటే- తాను ఇల్లు వదిలిపోవడం లేదని.. ఈ లోకంపోకడ స్వయంగా తెలుసుకుని మళ్లీ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తానని యువకుడైన మోడీ తల్లిదండ్రులకు గట్టి భరోసా ఇచ్చాడు. అందుకే కన్నవారు కూడా మరోమాట లేకుండా కొడుకును హిమాలయాలకు పంపించారు. ఆ తర్వాత పరమ శివుడి ఆవాసమైన కైలాస మానస సరోవరానికి వెళ్లనిచ్చారు.


మోడీకి ఈ అభిలాష కలగడం వెనుక ఓ కథ ఉంది. మోడీ బాల్యంలో ఆయన తల్లి ఓ సాధువును కలిశారు. మోడీ కుటుంబం వాద్ నగర్లో ఉంటున్నప్పుడు ఈ ఘటన జరిగింది. మోడీకి, ఆయన సోదరుడు సోమ్ కీ జాతకం ఎలా ఉంటుందో ఆ తల్లి చూపించుకుంది. సోమ్ జీవితం సాదాసీదాగా సాగుతుందని.. మోడీకి మాత్రం మహారాజయోగం ఉందని ఆ సాధువు చెప్పాడు. సన్యాసం వైపు మళ్లితే శంకరాచార్య అంతటి గుర్తింపు దక్కే  అవకాశం ఉందని జోస్యం చెప్పాడు. ఆయన చెప్పినట్టే మోడీ యవ్వనంలో హిమాలయాలకు వెళ్లివచ్చారు. కానీ సన్యాసం స్వీకరించలేదు. ఈ లోకం పోకడ తెలుసుకుని మళ్లీ క్షేమంగా ఇంటికి వచ్చేశారు. ఇక రాజయోగం సంగతి ఇప్పుడు తేలాల్సి ఉంది. 


ఓ సాదాసీదా కుటుంబం నుంచి వచ్చిన మోడీ- రైల్వే స్టేషన్లో చాయ్ అమ్మే స్థాయి నుంచి గుజరాత్ లాంటి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి  అయ్యారు.  అగ్రకులాల ఆధిపత్యం ఎక్కువగా కనిపించే బీజేపీలో బీసీ వర్గానికి చెందిన మోడీ అనూహ్యంగా ఎదిగారు. నూనె గానుగ ఆడించే కులానికి చెందిన కుటుంబం మోడీది. మధ్యతరగతి కుటుంబం నుంచి జగమంత కుటుంబంలోకి అడుగుపెట్టిన మోడీ స్వశక్తితో పైకెదిగారు. ప్రజల ఆశీర్వాదంతో గుర్తింపుపొందారు. 

ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఆయన పేరు మార్మోగుతోంది. రాజయోగం ఉందంటూ ఆనాడు సాధువు చెప్పిన మాట నిజం కాబోతోందా..! ఈ దేశానికి మోడీ ప్రధాని కాబోతున్నారా..! ఎన్నికల సర్వేలు మోడీని అంకెల పల్లకీలో ఊరేగిస్తున్నాయి. కానీ రాజకీయ కుమ్ములాటల్లో ఆయన ప్రయాణం అనుకున్నంత సాఫీగా సాగుతుందా..!           

2 comments:

Zilebi said...


యవ్వనం లో మోడీ హిమాలాయాలకు ఎందుకు వెళ్ళాడు ?

వృద్దాప్యం లో కురుక్షేత్ర లో తను బిజీ అయి పోతాడని తనకు తెలుసు కాబట్టి !


జిలేబి

Chiru Dreams said...

>>వృద్దాప్యం లో కురుక్షేత్ర లో తను బిజీ అయి పోతాడని తనకు తెలుసు కాబట్టి !

వహ్వా! వహ్వా! జిలేబి సూపర్

>> రాజయోగం ఉందంటూ ఆనాడు సాధువు చెప్పిన మాట నిజం కాబోతోందా..!

రాజయోగం అంటే ప్రధాని పదవేనా లేక అమెరికా అధ్యక్షుడు కూడా అవుతాడా? లేక భగవంతుడి దశావతారం మొడీనే అని ప్రచారం చెయ్యకూడదూ?