Thursday 10 April 2014

మోడీ పెళ్లయిన బ్యాచిలరే!


నరేంద్ర మోడీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఓ నిజాన్ని బయటపెట్టారు. అది తాను పెళ్లయిన బ్యాచిలర్నని. 

నలభై ఐదేళ్ల తర్వాత మోడీ పెళ్లి విషయం అధికారికంగా బయటికొచ్చింది. గుజరాత్్లోని వడోదర నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న మోడీ నామినేషన్ పత్రాల్లో తన భార్య వివరాలు వెల్లడించారు. ఆమె పేరు జశోదా బెన్. 

మోడీకి పదిహేడేళ్ల వయసులో వీరి వివాహమైంది. అయితే ఒకటి రెండు వారాల్లోనూ ఇద్దరూ దూరమయ్యారు. తమ కుటుంబ ఆచారం ప్రకారం మోడీకి బాల్య వివాహం జరిగిందని ఆయన సోదరుడు వెల్లడించారు. అప్పట్లో తమ కుటుంబంలో ఎవరూ చదువుకున్న వాళ్లు లేనందున  పెళ్లి.. ఆ వెంటనే విడిపోవడం జరిగాయంటున్నారు. అయితే కాళ్ల పారాణి ఆరకముందే పుట్టింటికి చేరిన జశోద ఏడో క్లాస్తో ఆపేసిన చదువును కొనసాగించారు.  టెన్త్ ప్యాసయ్యాక టీచర్ ట్రైనింగ్ చేసి ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం సంపాదించారు. ఆనాటి నుంచే మోడీ కుటుంబంతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. సాదాసీదా జీవితం గడిపిన జశోద ఇప్పటికీ అతి సామాన్యంగా ఉంటారు.

      ఇక మోడీ విషయానికి వద్దాం.. పెళ్లి తర్వాత భార్యకు దూరమైన ఆయన ఆ తర్వాత పీజీ చదివారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా చేరి పూర్తి జీవితాన్ని సంఘ్ కార్యకలాపాలకే అంకితం చేశారు. విశ్వ హిందూ పరిషత్,  బీజేపీలో జాతీయస్థాయి నేతగా ఎదిగినా ఏనాడూ తన వైవాహిక జీవితం గురించి బయటపెట్టలేదు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సార్లు గెలుపొందినా పలు దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేసినా భార్య గురించిన వివరాలేవీ బయటకు పొక్కలేదు. 

అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ దీనిపై వివాదం సృష్టించింది. జశోదా బెన్ గురించిన కథనాలు జాతీయ మీడియాలో వచ్చాయి. అయితే మోడీ దీన్ని అధికారికంగా ధృవీకరించలేదు, ఇతర బీజేపీ నేతలూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్నందున ఈ అంశంపై రచ్చ జరుగుతుందన్న భయంతోనే మోడీ ఈ నిజాన్ని వెల్లడించారని భావించవచ్చు. 

గతంలో అనేక సందర్భాల్లో తాను అవివాహితుడనని మోడీ చెప్పుకున్నారు. పెళ్లాం.. పిల్లలు లేని తనకు అవినీతిమార్గాల్లో సొమ్ము సంపాదించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అభ్యంతరం తెలిపారు. పెళ్లయిన నాయకులు అవినీతికి పాల్పడినట్లా అంటూ మోడీని ప్రశ్నించారు. ఇలా పలు సందర్భాల్లో తాను అవివాహితుడననే చాటుకున్న మోడీ ఎన్నికలవేళ పెళ్లి గుట్టును బయటపెట్టారు. 

అయితే ఏనాటికైనా భర్త దగ్గరకు చేరతావని జశోద బెన్ కు జ్యోతిష్యులు గతంలో చెప్పారుట. ఇప్పటికైనా ఈ మాట నిజమవుతుందా...? నలుగురు సోదరులు, ఒక సోదరి ఉన్న మోడీ ఎప్పుడైనా తల్లి దగ్గరే ఆశీర్వాదం తీసుకుంటారు. ఇకపై భార్య అభిమానాలు తోడవుతాయేమో! 






2 comments:

hari.S.babu said...

ఐనా దాని వల్ల వచ్చే ఇబ్బంది యేమయినా ఉంటే యశోదా బెన్ కి ఉండాలి గానీ మిగతా వారికి విమర్శించడానికి తప్ప దేనికి పనికొస్తుంది.ఆవిడ చదువూ సంధ్యా లేని నిరక్షర కుక్షి కాదుగా మోసం చేశాదని ఆరోపించడానికి.తను కూడా తన బతుకు తను బతుకుతున్నప్పుడు మనకెందుకు అనవస్రమయిన రంధి?

durgeswara said...

ఇంతకీ వీళ్ళ బాధేమిటి?
నిస్వార్ధంగా జీవిమ్చటం, వ్యక్తిగత జీవితం కంటే సమాజ సంతోషమే ముఖ్యమనే భావన కలిగియుండటం మోడి కుందకూడదు అనా?
మనకు అంటుకున్న మురికి ఎదుటవానికి లేకపోవటం సహించలేని పైశాచిక మనస్తత్వమా?