Monday 7 April 2014

సామాన్యుడు కాదు గట్టిపిండమే!

నాలుగున్నర దశాబ్ధాల క్రితం...
16 ఆగస్ట్- 1968.
ఆ రోజు శ్రీక్రుష్ణ జన్మాష్టమి.


హర్యానా లోని హిస్సార్ లో బార మొహల్లా అనే వీధి. గీతా దేవి, గోవింద రాం దంపతులకు ఓ బిడ్డ జన్మించాడు. శ్రీక్రుష్ణ జన్మాష్టమి కావడంతో పెద్దలు క్రుష్ణ  అనే పేరు పెట్టారు. గోవింద్ రాం హిస్సార్ లోని జిందాల్ స్ట్రిప్స్ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీరు.

ఈ బాలుడు సామాన్యుడు కాదు గట్టిపిండమే! అక్కడి స్కూళ్ళోనే చదువుకున్నాడు. బాల్యం నుంచే చేతిలో పెన్సిలూ కొన్ని కాగితాలూ ఉండేవి. తోచిన బొమ్మలేవో గీస్తూ తనదైన లోకంలో... సాధ్యమైనంత వరకూ నిశ్శబ్దంగా కూర్చునే తత్వం. పుస్తకాలు చదవడం.. చెస్ ఆడటం.. వీలుంటే క్రికెట్. వీటి మీదే మీదే ఆసక్తి.  ఓ రోజు సోదరికి విపరీతమైన జ్వరం. రెండో రోజు పరీక్షా. ఆ రాత్రంతా చెల్లెలి దగ్గరే ఉండి క్లాస్ పుస్తకమంతా చదివాడు. అది విన్న ఆమె పరీక్షా బాగా రాసి మార్కులు తెచ్చుకుంది. ఆ అమ్మాయే ఇప్పుడు హరిద్వార్ లోని బీ హెచ్ ఈ ఎల్ ఆస్పత్రిలో డాక్టరు.. 41 ఏళ్ళ రంజన.

చిన్న వయసులోనే ఇంత తెలివితేటలు చూపించిన ఆ అబ్బాయి అరవింద్ కేజ్రీవాల్. కేజ్రీకి మరో తమ్ముడు ఉన్నాడు. అతను మనోజ్, పూనే ఐ బీ ఎంలో సాప్ట్వేర్ ఉద్యోగి. కేజ్రీవాల్ ఐ ఐ టీ ఖరగ్పూర్ లో ఇంజనీరింగ్ చదివి టాటా కంపెనీలో కొంతకాలం ఉద్యోగం చేసాడు. ఆ తర్వాత రిజైన్ చేసేసి కొల్ కతా లోని మధర్ తెరిస్సా ఆశ్రమానికి వెళ్ళాడు.

మదర్ తెరిస్సాను కలిశాక కేజ్రీవాల్ ఆలోచనా విధానమే మారిపోయింది. సామాజిక సేవ మీద ఆసక్తి పెరిగింది. రెండెళ్ళు అక్కడే పని చేశాక సివిల్స్ రాశాడు. మొదటి ప్రయత్నం లో ఐ ఆర్ ఎస్ వచ్చింది. రెండో సారి రాసినా అదే. ఐ ఏ ఎస్ వస్తుందని అనుకున్నా రాలేదు.

ఇక్కడ లవ్ స్టోరీ మొదలైంది. ముస్సోరీ లోని లాల్ బహదూర్ అకాడెమీలో తన బ్యాచ్ మేట్ సునీతను అరవింద్ కేజ్రీవాల్ ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. అదెలాగో తెలుసా..? డైరెక్టుగా ఆమె ఇంటికే వెళ్ళి నన్ను పెళ్ళి చేసుకోవడానికి సిధ్ధమేనా అని అడిగేశాడుట!. అంటే ఏ వ్యవహారమైనా నిర్మొహమాటమే!. ఇద్దరూ నాగ్ పూర్లో ఉన్నప్పుడు వివాహం చేసుకున్నారు. సునీత ఇప్పటికీ రెవెన్యూ శాఖలో  ఉద్యోగి.


ఆ తర్వాత అన్నాతో కలిసి అవినీతి వ్యతిరేఖ ఉద్యమంలో పాల్గొనడం.. అంతకు ముందు ఆర్ టీ ఐ ఉద్యమం, లోక్ పాల్ పోరాటం, పరివర్తన్ అనే ఎన్ జీ ఓ కార్యక్రమాలు, ఆం ఆద్మీ పార్టీ ఏర్పాటు. మొత్తానికి కేజ్రీవాల్ సరి కొత్త రాజకీయాలకు నాంది పలికాడు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నా వీరి కుటుంబం చాలా సాదాసీదాగా గడిపింది. తన చుట్టూ ఉన్న ప్రజలకు ఏదో చేయాలనే తపన ఉన్న నేతగా కేజ్రీని యువతరం గుర్తించింది. 2014 ఎన్నికల్లో  పీ ఎం కేండిడేట్ గా అటు నరేంద్ర మోడీకీ ఇటు రాహుల్ గాంధీకీ గట్టి పొటీ ఇస్తున్నాడు. ఇప్పుడు దేశ ప్రజానీకం ఎదుట ఉన్న రాజకీయ ప్రత్యామ్నాయం ఆం ఆద్మీ పార్టీ. కేజ్రీవాల్ సామాన్యుడు కాదు గట్టిపిండమే!                                           
          

No comments: