Thursday, 21 March 2013

హీరోయే విలన్... పది సినిమాలకు ఇంటర్వెల్!

విలన్ విత్ ఏకే 56 !
రెండున్నర గంటల్లో ఎలాంటి విలనైనా హీరో చేతికి చిక్కుతాడు. అది సినిమా గనుక. ఖల్ నాయక్ లా మారిన బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను ముంబై వరుస పేలుళ్ల కేసు ఇరవయ్యేళ్లు వెంటాడింది. ఏకే 57 రైఫిల్ మీదున్న మోజే మున్నాబాయ్ ని కటకటాలపాలుచేసింది. ముందు తనకేమీ తెలియదన్న సంజూబాయ్ బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత బెదిరింపులు రావడం వల్ల కుటుంబ రక్షణ కోసమే ఆయుధాలు తెచ్చుకున్నానని ఒప్పుకున్నాడు. రైఫిళ్లు, పిస్టళ్లు, పేలుడు సామాగ్రి దొరికాకకూడా టెర్రరిస్టులతో సంబంధాల్లేవంటే ఎవరైనా నమ్ముతారా...? 

  మాఫియా డాన్ అబూ సలేం తన ఇంటికొచ్చేవాడని అంగీకరించాడు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులైన మాగ్నమ్ వీడియో అధినేతలు సమీర్ హింగోరా, హనీఫ్ కడ్వాలాలతో లావాదేవీలున్నట్లు చెప్పుకొచ్చాడు. మొత్తానికి దేశ ఆర్ధిక రాజధానిలో 1993లో స్టాక్ ఎక్సేంజ్ సహా కీలకమైన పదమూడు ప్రాంతాల్లో సంఘ విద్రోహశక్తులు జరిపిన మారణ హోమం కేసు కాకపోయినా దానికి అనుబంధంగా విచారణ సాగిన ఆయుధాల అక్రమ రవాణా కేసులో శిక్ష పడింది. 2007లో టాడా కోర్టు ఆరేళ్లు శిక్ష వేస్తే ఒకటిన్నర ఏడాది జైల్లోనే గడిచిపోయింది. ఇప్పుడు ఏడాది శిక్ష తగ్గినందున మరో మూడున్నరేల్లు జైలు జీవితం తప్పదు. ఆ రక్తపాతం సృష్టించిన టైగర్ మెమన్, దావూద్ ఇబ్రహీంలు పరాయి దేశాల్లో ఇల్లరికం అల్లుళ్లలా ఆతిథ్యం పొందుతున్నారు. మెమన్ సోదరుడు యాకూబ్ కు మాత్రం సుప్రీంకోర్టు మరణశిక్ష వేసింది. సుమారు వంద మందిలో కొందరు జీవితఖైదు, మరికొందరు వివిధ శిక్షలు అనుభవించనున్నారు. పాకిస్థాన్ గూడచార సంస్థ ఐఎస్ఐ చెప్పినట్లు చేశారు. ఫలితం అనుభవిస్తున్నారు. 13 చోట్ల పేలుళ్లు జరిపి 257 మందిని పొట్టన పెట్టుకున్న కిరాతకం. 713 మందిని గాయపరిచిన అమానుషం. 30 కోట్ల రూపాయల ఆస్తులను బుగ్గిపాల్జేసిన రాక్షసత్వం. ఇందరు విలన్ల వెనుక ఒక్క హీరో. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్. నిజజీవితంలో విలన్ అయ్యాడు. నాయక్ నహీ ఖల్ నాయక్ హూ మై అంటూ జీవితంలో రెండో దఫా ఊచలు లెక్కెట్టబోతున్నాడు.  

వెయ్యికోట్ల ప్రాజెక్టులకు ఇంటర్వెల్...!

ఖల్నాయక్ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టిన దశలో 1994లో సంజయ్ దత్ జీవితంలో చీకట్లు కమ్ముకున్నాయి. ఏడాదిన్నర జైలు జీవితం తర్వాత మామూలు మనిషైపోయిన సంజూభాయ్ మళ్లీ వెండి తెర రారాజుగా మారాడు. ఇప్పుడు ఎనిమిది సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. మరో మూడు నాలుగు సినిమాలు సంతకాలు కూడా చేసేశాడు. కాకతాళీయమే అయినా రాబోయే సినియాల్లో చాలా మటుకు సంజయ్ కేరక్టర్లన్నీ విలనీ పాళ్లెక్కువగా ఉన్నవే. 1973నాటి అమితాబ్ హిట్ మూవీ 'జంజీర్' మళ్లీ వస్తోంది. ఇందులో సంజయ్ దత్ పోషిస్తున్నది షేర్ ఖాన్ పాత్ర. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని మేలో రిలీజ్ కావాల్సిన 'జంజీర్' లో మన రామ్ చరణ్ తేజ కూడా నటిస్తున్నాడు. ప్రియాంకా చోప్రా హీరోయిన్. సంజయ్ జైలుకేసి అడుగులు వేస్తుండడంతో డైరెక్టర్ అపూర్వ లఖియాకు నిద్రలేని రాత్రులు మొదలయ్యాయి. రాజ్ కుమార్ హిరానీ సినిమా 'పీకే'లో సపోర్టింగ్ రోల్. ఇది దాదాపు పూర్తయిపోయింది. రాజ్ కుమార్ గుప్తా సినిమా 'గన్ చక్కర్' లో కామెడీ టచ్ ఉన్న పాత్ర. ఇదీ పూర్తయినట్లే. అయితే సంజయ్, ప్రాచీ దేశాయ్ జంటగా వస్తున్న 'పోలీస్ గిరి' పరిస్థితే అగమ్య గోచరంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ నడుస్తోంది. ఇంకో పది పదిహేను రోజులైతే షూటింగ్ పూర్తయ్యేదని నిర్మాత టీపీ అగర్వాల్ గగ్గోలు పెడుతున్నాడు. ఇది పాతిక కోట్ల ప్రాజెక్టు. ధర్మ ప్రొడక్షన్స్ 'ఉంగ్లీ' స్క్రిప్టింగ్  స్టేజిలో కథ ముందుకు కదలని డైలమా.

మున్నాభాయ్ 3 భవిష్యత్తేమిటి...?!

సంజయ్ సినీ జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది... 'మున్నాభాయ్ ఛలే ఢిల్లీ'. సక్సెస్ ఫుల్ మూవీ సీక్వెల్ 'మున్నాభాయ్ ఎంబీబీఎస్'...'లగే రహో మున్నాభాయ్'లకు ఇది థర్ల్ పార్ట్.  మున్నాభాయ్ ఛలే ఢిల్లీ అంటూ జైలుకెళ్లాల్సి వస్తోంది. ఛలే ఢిల్లీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న దర్శకుడు, నిర్మాత తర్జనభర్జనలు పడుతున్నారు.

ఓ తుపాకీ విలన్ గా మార్చింది...!

ఇలా సుమారు ఎనిమిదికి పైగా మూవీలు వివిధ స్టేజిల్లో, మరో మూడునాలుగు ట్రాక్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే వెయ్యి కోట్ల లెక్క. ఇప్పుడు ఈ సినిమాల దర్శకులు, నిర్మాతలు డైలమాలో పడ్డారు. సంజయ్ దత్నే నమ్ముకుంటే మరో మూడున్నరేళ్లు ఆగాల్సిందే. అంతదాకా బాలీవుడ్ లో ట్రెండ్ ఎలా మారిపోతుందో....!?. తుపాకీ మీద మోజుపడిన స్టార్ హీరో తెలిసితెలిసీ తప్పటడుగు వేసిన ఫలితం. ఆ పాపం ఇరవయ్యేళ్లయినా వెంటాడింది.  

No comments: