Wednesday, 20 March 2013

పచ్చనాకు సాక్షిగా...!

మోడువారేది మనమే! 

కూర్చున్న కొమ్మనే నరుక్కునే మనుషుల జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. ఏటా మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవం జరుపుకుంటున్నా ఎండిన మోడుల లెక్కే పెరుగుతోంది. ప్రకృతి పచ్చదనాన్ని చేజేతులారా మనమే చెరిపేసుకుంటున్నాం. చెట్టులేనిదే మనిషికి మనుగడ లేదని తెలుసు. అయినా అందరిలోనూ నిర్లక్ష్యమే. ఆది మానవుడు అడవిలోనే బతకడం నేర్చుకున్నాడు. నదీతీరంలోనే నాగరికత తెలుసుకుంటూ ఆధునికత వైపు అడుగులు వేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ పచ్చదనాన్నే హరించి వేసే స్వార్ధం అలవరుచుకున్నాడు. 

పచ్చదనమే మనిషి మనుగడ!

 పూజించిన చేతులతోనే...

వృక్షానికి వేదాల్లో, హిందూ మత గ్రంథాల్లో,  పురాణాల్లో చోటుంది. కోరికలు తీర్చే కల్పవృక్షం, కల్పతరువు మనకు తెలియనివికావు. దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు పాలసముద్రం నుంచి కామధేనువు, కల్పవృక్షం వచ్చాయిట. చరాచర జగత్తు కోరికలు తీరుస్తున్నఆ కల్ప వృక్షానికే నీడలేని దుస్థితి. రావి చెట్టును అశ్వత్థ వృక్షంగా పూజిస్తున్నాం. శివుడు దక్షిణామూర్తిగా రావి చెట్టు కిందే ధ్యానముద్రలో ఉన్నట్లు పురాణగాధలున్నాయి. బుద్ధగయలో ఉన్న బోధివృక్షాన్ని ఇప్పటికీ నిత్యం వేల మంది  దర్శించుకుంటున్నారు. బుద్దుడికి ఈ మహావృక్షం కిందే జ్ఞానోదయం అయిందని మనం విశ్వసిస్తాం. శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపం ప్రదర్శించి సమస్త విశ్వానికీ భగవద్ఘీతోపదేశం చేసినప్పుడు అశ్వథ్థ వృక్షం గురించి ప్రస్తావించాడు. సమస్త వృక్షాల్లో నేను అశ్వథ్థం లాంటి వాడినంటూ ఆ వృక్షానికున్న గొప్పదనాన్ని చాటిచెప్పాడు. హిందువులంతా ఇంటి ముంగిట తులసి కోటకు పూజచేస్తుంటారు. మహావిష్ణువు సహధర్మచారిణి అయిన మహాలక్ష్మి అవతారమే తులసి అంటారు. ఇక మర్రి చెట్టును త్రిమూర్తి స్వరూపం కింద కొలుస్తాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ దేవతావృక్షం మీద కొలువై ఉంటారని ప్రతీతి. కార్తిక మాసంలో ఉసిరి చెట్టుకింద భోజనం చేస్తే ఆరోగ్యదాయకం అని నమ్ముతున్నాం. అందుకే వన భోజనాలకు వెళ్తుంటాం. ఇంటి ముంగిట మామిడి తోరణం లేకుండా ఏ శుభకార్యమూ మొదలవదు. 

ప్రపంచంలోనే అతిపెద్దదైన అమేజాన్ అడవి

 చెట్టు నీడనే నాగరికత  

క్రిస్టియన్లు కూడా క్రిస్మస్ రోజున చెట్టును సుందరంగా అలంకరిస్తారు. ఈజిప్టియన్లు, రోమన్లు, గ్రీకులు ఇలా ఒక మతం, ఒక నాగరికత అని కాదు మనిషి మనుగడకు వృక్షానికి ఎంతో బంధముంది. ఒకవైపు పూజిస్తూనే మరోవైపు గొడ్డలి వేటు వేస్తున్నాం. నిత్యం మనం వినియోగించే కాగితం దగ్గర నుంచి అడవులు అంతరించి పోవడం మొదలవుతుంది. చెట్లను నరికే దుష్ట సంస్కృతికి బీహారులో కొంత మంది విరుగుడు కనిపెట్టారు. అదేంటో తెలుసా... చెట్లకు దైవత్వాన్ని ప్రసాదించడం. ఊర్లో కనిపించిన ప్రతి చెట్లు మీదా దేవుడి బొ్మ్మలు వేస్తే ఎవరూ దాని జోలికి రారానేది వారి నమ్మకం. సాంప్రదాయ మధుబని చిత్ర కళకు కూడా చెట్ల కాండాలే కాన్వసులవుతున్నాయి. కాండాలు, ఆకులు, కొమ్మలు... అన్నీ అందమైన కళాఖండాలే. దీనిపై గతంలో నేను రాసిన పోస్టు చివర్లో జతచేశాను. ఓసారి చూడండి.

మన నిర్లక్ష్యానికి ఇవే సాక్ష్యాలు

గాలే కాటేస్తుంది...

అడవులు అంతరించిపోవడం వల్ల మొదటి ముప్పు వాతావరణ కాలుష్యం. ప్రపంచ వ్యాప్తంగా వాహన కాలుష్యంతో ఎంతమేర కార్భన్ డయాక్సైడ్ వెలువడుతోందో అంతకు సమానమైన కార్భన్ పరమాణువులు(12-18 శాతం) అడవులు నరికివేయడం వల్ల వాతావరణంలో కలుస్తున్నాయి. ఊష్ణోగ్రత, రేడియేషన్ బాగా  పెరుగుతున్నాయి. 

మన ఊపిరి ఆగిపోతోంది?

  • ఏటా మూడున్నర కోట్ల ఎకరాల అడవి కనుమరుగు
  • ప్రపంచంలో ఇప్పటికీ 30 శాతం భూభాగంలో అడవులు
  • మనదేశంలో 79 మిలియన్ హెక్టార్లు(భూభాగంలో 24 శాతం)
  • అమెరికాలోని అమేజాన్ అడవులే పెద్దవి
  • మనుగడ సాగిస్తున్నవి అరవై వేల రకాల వృక్ష జాతులు
  • నూటా అరవై కోట్ల మందికి అడవుల్లోనే ఉపాధి
  • అడవుల్లోనే తాగునీరందించే వనరులు
  • వర్షాలు కురవాలంటే అడవులే దిక్కు
  • తినేందుకు దుంపలు, కాయలు, పండ్లు, గింజలు, తేనె
  • జీవనానికి వంటచెరుకు, పనిముట్లు,ఫర్నిచర్ కోసం కలప
  • వైద్యానికి వేర్లు, మూలికలు, బెరడు, ఆకులు, కాయలు

అందమైన ఆకాశం కాదు... కబళిస్తున్న ఎడారి

గ్లోబల్ 'వార్నింగ్'

  • చెట్ల నుంచే స్వచ్చమైన గాలి, శుభ్రమైన నీరు
  • ఆక్సిజన్ అందిస్తూ గాలిలోని కార్బన్ డయాక్సైడ్ గ్రహించేవి చెట్లే
  • నదులు, కాలువల నీటి ప్రవాహాలకు అడవులే ఆనకట్టలు
  • చెట్లతో భూమి కోతలకు నివారణ, భూసార పరిరక్షణ
  • భూవాతావరణాన్ని పరిరక్షిస్తాయి... భూతాపాన్ని చల్లబరుస్తాయి
  • అడవుల నరికివేతతో గ్లోబల్ వార్మింగ్ ముప్పు
  • గ్లోబల్ వార్మింగుతో పెరుగుతున్న భూఉపరితల ఊష్ణోగ్రత
  • కాలుష్యంతో ఉబ్బసం, ఊపిరితిత్తుల వ్యాధులు
  • రేడియేషన్తో క్యాన్సర్, గుండె జబ్బులు
  • ఏటా వాయు కాలుష్యానికి పాతికలక్షల మంది బలి

మనచేతుల్లోనే మన మనుగడ

  • కాగితం వినియోగం తగ్గించాలి
  • పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, ఆకాశం, నేల పదిలం
  • చెట్లను నరికేయడం మానుకోవాలి
  • వీలున్న ప్రతి సందర్భంలో మొక్కలు నాటాలి

---------

బీహారు వృక్ష ప్రేమికుల కళాత్మక హృదయాలు... 

 వృక్షాలు...దైవ స్వరూపాలు

చెట్టు ప్రగతికి మెట్లన్నారు పెద్దలు. అలాంటి మెట్లనే మనం చేజేతులారా పగడొట్టుకుంటున్నాం మనం. పచ్చని చెట్లను తెగనరుకుతున్నాం. దీంతో పర్యావరణ సమస్యలెన్నో తలెత్తుతున్నా లెక్కచేయడం లేదు. బీహారులో కొన్ని స్వచ్ఛంద సంస్థలు చెట్ల పరిరక్షణకు నడుం కట్టాయి. 

వృక్షాలను ఎవరూ గొడ్డలి వేటు వేయకుండా ఉండాలంటే ఏం చేయాలా అని ఆలోచించారు. కొత్త ఐడియా తట్టింది. అదే చెట్లన్నిటినీ దైవ స్వరూపాలుగా మార్చేయడం.అంటే చెట్ల మీద దేవతా మూర్తుల చిత్రాలు పెయింట్ చేయడమన్న మాట. అనుకున్నదే తడవుగా  వారు ఆచరణలో పెట్టారు.

దేశంలోనే అతి తక్కువ అటవీ విస్తీర్ణం ఉన్నబీహారు రాష్ర్టంలో చెట్ల పరిరక్షణను ఓ ఉద్యమంలా చేపట్టారు. బ్రెష్షులు, రంగులు తీసుకుని కనిపించిన చెట్లన్నీ పెయింట్ చేస్తున్నారు. 

వారి సాంప్రదాయ చిత్రకళ మధుబనికి కూడా చెట్ల కాండాలే కాన్వాసులవుతున్నాయి. చివరికి ఆకులను కూడా అందమైన రంగులతో తీర్చిదిద్దుతున్నారు. 

ఇప్పటికే ఐదు వేల వృక్షాలు వీరి చేతుల్లో అందమైన కళాఖండాలుగా... అంటే దేవతా వృక్షాలుగా మారిపోయాయి. ఎవరూ చెట్లును నరక కూడదన్నదే ఈ చిత్రకారుల లక్ష్యం. 


దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మనమూ ఓ చెట్టునైనా పరిరక్షిస్తే బెటర్...

4 comments:

Unknown said...

చాలా బావుంది... మీకు ధన్యవాదాలు...

మీకు సమయం దొరికినపుడు మా బ్లాగ్ ను కూడా ఒక చూపు చూడండి. :)

ధన్యవాదాలు,
తరుణ్,
www.techwaves4u.blogspot.com (తెలుగు లో టెక్నికల్ బ్లాగు )

nihar said...

కృతజ్ఞతలు మిత్రమా... మీ బ్లాగు ఎంతో ఉపయోగకరంగా ఉంది. తెలుగులో టెక్నికల్ బ్లాగు నడుపుతూ అందరికీ తోడ్పడుతున్నారు. అభినందనలు...నిహార్.

జలతారు వెన్నెల said...

నిహార్ గారు, ఎన్నో మంచి విషయాలు, చక్కని టాపిక్స్ తో తాజా గా ఉంది మీ బ్లాగ్.Nice work!

nihar said...

జలతారువెన్నెలగారూ... థాంక్స్. మీలాగే అందరూ ఆసక్తిగా చదువుతూ వుంటే ఎలాంటి బ్లాగరుకైనా ఉత్సాహం. ఈ బ్లాగు విషయానికొస్తే మిత్రులు బాగానే చదువుతున్నారు. జనవరి రెంబోవారంలో మొదలెట్టాను, ఫిబ్రవరి చివరికి వెయ్యి మంది కూడా చదివినట్లు లేదు. మార్చి ఒకటి నుంచి పుంజుకుంది. ఈ 22 రోజుల్లో సగటున రోజులకు 200 మంది చొప్పున ఐదు వేలకు పైనే చదివినట్లు లెక్కతేలింది. మీలాంటి మిత్రులందరికీ కృతజ్ఞతలు...
నిహార్