Monday 4 March 2013

'మొక్కజొన్న కంకి' మీద 'శాంతి' కపోతం!

అక్షరమే ఆయుధం!

మొక్క జొన్న కంకి మీద శాంతి కపోతం వాలబోతోంది. అవును... ప్రపంచంలో ఓ ప్రయోజనం కోసం- నిర్భయంగా, నిర్భీతిగా, నిజాయితీగా తన అభిప్రాయాలను ప్రపంచం ముందు పెట్టిన ఓ బ్లాగర్ కు నోబెల్ శాంతి పురస్కారం దక్కే అవకాశం కనిపిస్తోంది. ఆ 'మొక్క జొన్న కంకి' పాకిస్థానీ బాలిక మలాలా యూసఫ్జాయ్. 'గుల్ మకాయ్'(అంటే మొక్కజొన్న కంకి) కలం పేరుతో  పాకిస్థాన్లోని అత్యంత వెనుకబడిన స్వాత్ లోయలో బాలికల విద్యా హక్కుల  కోసం పోరాడింది. చివరికి తాలిబన్ల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి బ్రిటన్ ఆస్పత్రిలో అనేక ఆపరేషన్ల తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. 

నీ దూరదృష్టి హక్కుల పోరాటంలో కొత్త చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది...

 

బ్లాగుతోనే పోరాట ప్రస్థానం...

2009లోనే మలాలా బీబీసీ ఉర్దూ బ్లాగుకు రాయడం మొదలెట్టింది. అంటే 11 ఏళ్ల చిరుప్రాయంలో తనలాంటి వేల మంది చిన్నారుల హక్కుల కోసం ప్రశ్నించడం ప్రారంభించింది. బీబీసీ ఉర్ధూ డైరీ ఓ బ్లాగులా ఆమె అభిప్రాయాలను ప్రపంచం దృష్టి తీసుకువెళ్లింది. ఆమె పేరులోనే ఏదో పవర్ ఉంది. మలాలా పేరెలా వచ్చిందంటే... ఫస్తూన్ తెగకు చెందిన కవయిత్రి, యోధురాలు మలాలాయ్ గుర్తుగా కూతురుకు మలాలా అనే పేరుపెట్టారు జియావుద్దీన్ యూసఫ్జాయ్. మలాలా అంటే దఫఖాన్ని దూరం చేసేది అని అర్ధం. నిజంగా ఈ సాహస బాలిక సార్ధక నామధేయురాలే కదా. మలాలా కలం నుంచి వెలువడిన తొలి అక్షరాల మాలిక...
----
I am afraid - 3 January 2009

"I had a terrible dream yesterday with military helicopters and the Taliban. I have had such dreams since the launch of the military operation in Swat. I was afraid going to school because the Taliban had issued an edict banning all girls from attending schools. Only 11 students attended the class out of 27. The number decreased because of Taliban's edict.

On my way from school to home I heard a man saying 'I will kill you'. I hastened my pace... to my utter relief he was talking on his mobile and must have been threatening someone else over the phone."

(బీబీసీ సౌజన్యంతో....
----

ప్రపంచాన్ని మేల్కొలిపిన 'స్వాత్' పొలికేక!

ఇలా పొలికేక పెట్టిన మలాలా స్వాత్ లోయలో తాలిబన్లనే ఎదురొడ్డి నిలిచింది. 'లైఫ్ అండర్ తాలిబన్' శీర్షికతో స్వాత్ లోయలోని మహిళల కష్టాలు, చిన్నారుల సమస్యలకు అక్షర రూపమిచ్చేది. మనుషులందరి మీదా ఆంక్షలు పెట్టిన తాలిబన్ల పెత్తనాన్ని నిగ్గదీసి ప్రశ్నించింది. చివరికి ఆ రాక్షససమూహం కాల్పుల్లో గాయపడింది. ప్రాణాపాయ స్థితిలో బ్రిటన్ ఆస్పత్రిలో చికిత్స పొందాక నెమ్మదిగా కోలుకుంటోంది. ఇంత జరిగినా తన పోరాటమార్గాన్ని వీడేది లేదని దైర్యంగా చెప్తున్న మలాలా ఏదో రోజున తన వారి కోసం స్వాత్ లోయకి మళ్లీ వస్తుంది.

నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన పిన్న వయస్కురాలు

2013 నోబెల్ శాంతి బహుమతి కోసం రికార్డు స్థాయిలో నామినేట్ అయిన 259 మందిలో అత్యంత చిన్న వయస్సు మలాలాదే. అటూఇటూగా పదిహేడేళ్ల ప్రాయం. చిన్న తనంలోనే ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి దక్కించుకుంది. పాకిస్థాన్లో ప్రతిష్టాత్మక యువ శాంతి బహుమతి సొంతం చేసుకుంది. మలాలా స్ఫూర్తిని గుర్తించిన ఐక్యరాజ్య సమితి నవంబర్ 15వ తేదీని 'మలాలా' దినోత్సవంగా ప్రకటించింది. అంటే ప్రతియేటా ఆ రోజున బాలికల విద్యా కార్యక్రమాలు చేపడతారు. ఐరాస తరఫున గ్లోబల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్న గోర్డన్ బ్రౌన్ ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. 2105 నాటికి ప్రపంచంలోని పిల్లలందరూ తప్పనిసరిగా బడికి వెళ్లేలా చేయడమే ఈ ప్రోగ్రాం ఉద్దేశం.

మొక్కజొన్న కంకి మీద శాంతి కపోతం...

ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం మలాలానే వరించనుందని అంచనా. ఆ సాహసికి, ఆ నిత్యచైతన్యశీలికి, ఆ స్పూర్తిప్రదాతకి ఎన్ని కీర్తికిరీటాలు తొడిగినా తక్కువే. 'గుల్ మకాయ్'(మొక్కజొన్న కంకి) వెదజల్లుతున్న అక్షరాల విత్తులను నోబెల్ పురస్కారం రూపంలో వచ్చే 'శాంతి'కపోతం ప్రపంచమంతా విస్తరించపచేయాలనేది అందరి ఆకాంక్ష.
 

No comments: