Saturday, 30 March 2013

డబ్బు మనుషులు

బజారుకీడ్చిన ఇంటికోడలు!

ఇరవైఒకటో శతాబ్ధంలో బతుకుతున్నా సామాజిక దురాచారాలకు ఇంకా దూరం కాలేకపోతున్నాం. అన్నిటికీ మూలం డబ్బు. "ధనం మూలం ఇదం జగత్" అన్నారు పెద్దలు. కానీ ఆడదే మూలధనంగా మారిపోతోంది. వరకట్నం వేధింపులు, గృహహింసకు తెరపడడం లేదు. మరో వీరేశలింగం పంతులు... మరో రాజారామ్మోహన్ రాయ్ తయారైతే గానీ సొసైటీని సంస్కరించడం సాధ్యం కాదేమో! ప్రజలందరికీ ఆదర్శంగా ఉంటామని రాజ్యాంగం మీద ప్రతినబూనిన నేతలు కూడా మహిళల పట్ల కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు. 

ఇంకానా ఇకపై సాగదంటూ న్యాయ పోరాటం... బర్షాస్వోనీ చౌదురి(మధ్యలో)

ఒడిషా మాజీ మంత్రి రఘునాథ్ మొహంతీ ఇంటి కథ ఒక ఉదాహరణ మాత్రమే. ఇది ఓ టీవీ సీరియల్ లా మలుపులు తిరుగుతోంది. సదరు రఘునాధుడికి వరకట్న వేధింపుల కేసుతో మంత్రి పదవి ఊడింది. పోలీసుల కళ్లుగప్పి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తలదాచుకున్నా... చివరికి కటకటాలు లెక్కించాల్సిన దురవస్థ వచ్చింది.

న్యాయ మంత్రిగా వైదొలిగిన రఘునాధ్ మొహంతి

అన్యాయ మంత్రేనా...

బీజేడీ సీనియర్ నేత రఘునాధ్ గత నెల దాకా ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కేబినెట్లో న్యాయశాఖా మంత్రి. మంత్రి కుమారుడు రాజాశ్రీ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. భర్త, అత్తామామలు వేధిస్తున్నారంటూ రాజాశ్రీ భార్య బర్షా స్వోనీ చౌదురి కేసు పెట్టారు. 

వరకట్న వేధింపుల ఆరోపణలున్న రాజాశ్రీ

ఖరీదైన కారు, ముప్పయిఐదు లక్షలు తీసుకురావాలంటూ వేధించారనేది ఫిర్యాదు. దీనిపై వరకట్న వేధింపులు, గృహహింస చట్టాల కింద దర్యాప్తు జరుగుతోంది. ఈ వ్యవహారంలో రఘునాధ్ మంత్రిపదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజశ్రీ గతనెల అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు రఘునాధ్, ఆయన భార్య ప్రీతిలత పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే ఇతర వరకట్న వేధింపుల కేసుల మాదిరిగానే రఘునాధ్ కుమార్తె రూపాశ్రీ, ఆమె భర్త సువేందు మీదా కేసులు పెట్టారు. వేధింపులతో ఎవరకి ఎంత వరకూ సంబంధం ఉందో తెలియదు గానీ ఈ బడా నాయకుడి ఫ్యామిలీ ఇప్పుడు ఇరకాటంలో పడింది. 

రఘునాధ్ కుటుంబంపై మహిళా సంఘాల పోరాటం

రాజకీయ దుమారం

ఈ వ్యవహారంపై ఒడిషా అసెంబ్లీలో రచ్చరచ్చ సాగింది. అధికార బీజేడీ రఘునాధ్ ను ఎలా రక్షించాలో తెలియక తర్జనభర్జనపడుతోంది. కాంగ్రెస్, బీజేపీలకు ఇదో అస్త్రంగా మారింది. ఉన్నత స్థానంలో ఉన్న ప్రజాప్రతినిధి కుటుంబం వరకట్నం మీదున్న యావతో ఇంటికోడలిని వేధించి చివరికి బజారున పడాల్సి వచ్చింది. ఇలాంటి కథలు, వ్యధలు అనేక కుటుంబాల్లో రగులుతూ ఉంటాయి. కొన్ని బయటికి వస్తాయి. మరికొన్ని పలుకుబడి, కండబలం మధ్య గాలికికొట్టుకుపోతాయి. మనిషిలో మార్పు రానంతవరకూ ఇలాంటి సామాజిక దురాచారాలకు తెర పడటం అసాధ్యం. ఈ మార్పు రావాలంటే ఒక్కరు కాదు వేల మంది వీరేశంలింగం పంతుళ్లు, లక్షల మంది రాజారామ్మోహన్ రాయ్ లు యువతరం నుంచే తయారు కావాలి.  

No comments: