Wednesday, 8 May 2013

తిరగబడిన శృంగేరి సెంటిమెంట్

 12 ఎన్నికలుగా నిజం... ఇప్పుడు...!

కర్నాటక అసెంబ్లీలో ఎన్నికల్లో ఆరు దశాబ్ధాలుగా ఓ సెంటిమెంటు ఉంది. ఈ ఎన్నికల్లో ఆ సెంటిమెంట్ తారుమారైంది. అదే ఆధ్మాత్మిక కేంద్రమైన శృంగేరి పీఠం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం. 

 

ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందనేది నమ్మకం. కానీ ఈసారి ఎన్నికల్లో సెంటిమెంట్ రివర్స్ అయింది. 


శృంగేరి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి జీవరాజ్ ఘన విజయం సాధించారు. అదే రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించింది. అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉంటారన్న మాట. శృంగేరి సెంటిమెంట్ ప్రకారం బీజేపీ సీఎం ఉండాలి!. ఇప్పుడేం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. అసలు శృంగేరి ఎన్నికల విశ్వాసం పూర్వపరాలను పరిశీలిద్దాం.

తొలి ఎన్నిక నుంచే సెంటిమెంటు

1952 లో తొలిసారి ఎన్నికలు జరిగే నాటికి శృంగేరి ప్రాంతం తీర్థహళ్లి కొప్పా అనే నియోజకవర్గం పరిధిలో ఉండేది. ఆ ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కడిదల్ మంజప్ప ఏకంగా ముఖ్యమంత్రి పీఠమే అధిష్టించారు. 

బ్యానర్ మీదున్న చిత్రం తొలి ఎమ్మెల్యే, సీఎం మంజప్ప

 1957 ఎన్నికల్లో శృంగేరి నియోజకవర్గంగా మారింది. అప్పడూ మంజప్ప మళ్లీ గెలిచారు. అయితే సీఎంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన జట్టీ పగ్గాలందుకున్నారు. 1962లోనూ మంజప్ప గెలిచారు. సీఎంగా అదే పార్టీకి చెందిన ముగ్గురు వ్యక్తులు మారారు. 1967, 72 ఎన్నికల్లోనూ ఇదే సెంటిమెంట్ పనిచేసింది. 1978 ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థి బెగానే రామయ్య గెలిచారు. ఇదే పార్టీకి చెందిన గుండూరావు సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. 1983, 85 ఎన్నికల్లో జనతాపార్టీ అభ్యర్థి గోవిందె గౌడ గెలిచారు. ముఖ్యమంత్రి పీఠం మీద జనతాపార్టీకి చెందిన రామకృష్ణ హెగ్డే, ఎస్సార్ బొమ్మై కొనసాగారు. 1989లో మళ్లీ కాంగ్రెస్ వంతు వచ్చింది. శృంగేరిలో కాంగ్రెస్ గెలిచింది. సీఎంలుగా ముగ్గురు మారినా అంతా కాంగ్రెస్ వారే. 1994లో జనతాపార్టీ నుంచి జనతాదళ్ లోకి మారిన గోవిందె గౌడ ఎమ్మెల్యేగా గెలిచారు. అదే పార్టీకి చెందిన దేవెగౌడ, జేహెచ్ పటేల్ సీఎంలుగా పనిచేశారు. 1999లో ఎమ్మెల్యే కాంగ్రెస్, ముఖ్యమంత్రీ కాంగ్రెస్సే. 2004లో జీవరాజ్ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే సీఎం గా కొంతకాలం కాంగ్రెస్ పార్టీకి చెందిన ధరంసింగ్, జేడీఎస్ నేత కుమారస్వామి ఉన్నా చివరికి బీజేపీకి చెందిన యెడ్యూరప్పకే పీఠం దక్కింది. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ జీవరాజ్ బీజేపీ కేండిడేట్గా గెలిచారు. సీఎంలుగా ముగ్గురు అంటే యెడ్యూరప్ప, సదానందగౌడ, జగదీశ్ శెట్టార్(ఈ ఎన్నికలతో పదవీ కాలం పూర్తయింది) బీజేపీ వారే. ఇప్పటి వరకూ పన్నెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ శృంగేరి పొలిటికల్ సెంటిమెంట్ నిజమవుతోంది. ఇప్పుడు జీవరాజ్ బీజేపీ నుంచి ఎమ్మేల్యేగా గెలిచారు. అయితే అధికార బీజేపీ ఘోరంగా పరాజయం పాలైంది. మెజారిటీ సీట్లు సాధించిన కాంగ్రెస్ నాయకుల్లో ఎవరో ఒకరు సీఎం పీఠం అధిష్టించనున్నారు. మరి సెంటిమెంట్ మాటేమిటి!. ఈసారి సెంటిమెంటు ఎందుకు పనిచేయలేదు. ఎందుకు తారుమారైంది. అంతా ఆసక్తికరమే!.   

No comments: