Tuesday 14 May 2013

హిమ శిఖరాల్లో భూకైలాసం

భక్తిపారవశ్యం... నాలుగు ధామాల దర్శనం!

భక్తి పారవశ్యాన్ని , పర్యాటక అనుభూతినీ కలిగించే యాత్ర చార్ ధామ్. హిమశిఖరాల్లో వెలిసిన దివ్యక్షేత్రాలు దర్శించుకోవాలంటే చార్ థామ్ యాత్ర భక్తులకు మంచి అవకాశం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయాల్లో వెలిసిన దివ్యక్షేత్రాలను సందర్శించుకునే చార్ థామ్  యాత్ర అక్షయ తృతీయ రోజు నుంచి ఆరంభమైంది. కైలాసాన్ని తలపించేలా మంచు కురుస్తున్నందున ఆరు నెలల పాటు మూసివేసిన గంగోత్రి, యమునోత్రి, కేధార్ నాధ్, బదిరీనాథ్ ఆలయాలను భక్తుల కోసం తెరిచారు. హిందువులు పవిత్రంగా భావించే నాలుగు ఆలయాలు దేశం నలుదిక్కులా కొలువై ఉన్నాయి. అవే నాలుగు ధామాలు... చార్ థామ్. ఉత్తరంలో బదిరీనాథ్, పశ్చిమాన ద్వారక, తూర్పున పూరీ, దక్షిణాన రామేశ్వరం. హిమాలయాల్లో కొలువుదీరిన నాలుగు క్షేత్రాలు బదరీనాథ్, కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రి.  

బద్రీనాథ విష్ణు దర్శనం

అలకనంద తీరాన వెలిసిన బద్రీనాధుడు

రుషీకేష్ కు మూడు వందల కిలోమీటర్ల దూరంలో నర, నారాయణ పర్వతాల మధ్య వెలిసిన క్షేత్రం బద్రీనాథ్. హిమాలయాల్లో నీలకంఠ శిఖరం అంటే 6597 మీటర్ల ఎత్తున విష్ణుమూర్తి అవతారమైన బద్రీనాధుడు కొలువై ఉన్నాడు. ఆది శంకరాచార్యులవారే ఎనిమిదో శతాబ్ధంలో ఈ నాలుగు దివ్య ధామాలను నిర్మించారని భక్తుల విశ్వాసం. మే నుంచి నవంబర్ మాసాల మధ్య బద్రీనాథ్ సందర్శించుకోవడానికి వాతావరణం అనుకూలిస్తుంది. భూలోకంలో బద్రీనాథ్ మించిన పవిత్ర స్థలం లేదని ప్రతీతి. 

కేదారనాథ్లో శివరూపం

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కేధారనాథుడు

హిమాలయాల్లోని గౌరీకుండ్ ప్రాంతంలో సముద్ర మట్టానికి 3581 మీ ఎత్తున ప్రకృతి సోయగాల మధ్య కొలువైన క్షేత్రం కేధారనాధ్. రుద్రప్రయాగకు 34 కిమీ దూరంలో ఉంటుంది. పరమ శివుడి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి కేధార్నాథ్. సృష్టి, లయ కారకుడైన ఆ శివుడి రూపమే కేధారనాధుడు. 

భువికి వచ్చిన గంగమ్మ కొలువు

భాగీరథీ తీరాన కొలువైన గంగోత్రి

ఉత్తరకాశీ జిల్లాలో భాగీరథీ తీరాన వెలిసిన దివ్య క్షేత్రం గంగోత్రి. పద్దెనిమిదో శతాబ్ధం కాలం నాటి దేవాలయంలో గంగామతల్లి భక్తకోటికి దర్శనమిస్తుంటుంది. స్వర్గం నుంచి జాలువారిన గంగ మొదట ఈ పవిత్ర స్థలంలోనే నేల మీద అడుగుపెట్టిందని నమ్మకం. జోలీగ్రంట్ కు దగ్గరగా ఉండే గంగోత్రికి చేరుకోవాలంటూ చాలా మాగర్గాలున్నాయి. 

కొలువైన యమునమ్మ

నదీమతల్లి జన్మస్థలి యమునోత్రి

యమునా నది పుట్టిన క్షేత్రమే యమునోత్రి. సముద్రమట్టానికి 6315 మీ ఎత్తులో బందర్పంచ్ శిఖరాల్లో వెలిసిన ఈ ఆలయంలో పూజలందుకునేది యమునా దేవి. హనుమాన్చట్టి వరకూ రవాణా సౌకర్యం ఉంటుంది. అక్కడి నుంచి పదమూడు కి.మీ దూరం కాలినడకన పర్వత ప్రాంతంలో ముందుకు సాగితే పవిత్ర యమునాదేవి దర్శనమిస్తుంది. 

No comments: