Wednesday 1 May 2013

ఆయుధం...ఆటబొమ్మ... అనర్ధం!

చెల్లిని రైఫిల్ తో కాల్చేసిన ఐదేళ్ల అన్న!
అమెరికాలో ఆయుధం చాలా సందర్భాల్లో అనర్థాలు తెచ్చిపెడుతోంది. తుపాకీ దుష్ట సంస్కృతిపై పెద్ద స్థాయిలో చర్చ కూడా జరిగింది. ఒబామా రెండోసారి అధ్యక్షుడయ్యాక ఆర్మ్స్ యాక్టును కఠినతరం చేసినా తుపాకీ అనేది అగ్రరాజ్యంలో పిల్లల చేతుల్లో బొమ్మలాగానే ఉందని మరో ఘటన రుజువు చేసింది. ఆమధ్య ఓ టీనేజ్ కుర్రాడు ఎలిమెంటరీ స్కూల్లోకి చొరబడి చిన్నారులను పిట్టల్ని కాల్చినట్లు కాల్చేశాడు. అలాంటి ఘటనలు ఒకటివెంట ఒకటిగా చాలానే జరిగాయి. ఇప్పుడు ఐదేళ్ల బాబు తన చెల్లెలైన రెండేళ్ల చిన్నారిని తుపాకీతో కాల్చిపారేశాడుట! ఎంత దారుణం? 

 

 ఆయుధం పిల్లలకు గిఫ్టుగానా....

పైగా  ఆ బాబు వాడింది తనకెవరో గిప్టుగా ఇచ్చిన రైఫిల్!. అది బొమ్మ తుపాకీ కాదు. నిజమైన పాయింట్ 22 కాలిబర్ రైఫిల్. అసలు ఇలాంటి వస్తువును గిఫ్టుగా ఇచ్చిన వాడికీ విచక్షణ లేదనాలి.  ప్రమాదకరమైన వస్తువును మిగతా బొమ్మల్లాగా గది మూలన అందుబాటులో పెట్టిన ఆ పిల్లాడి తల్లిదండ్రులకూ బుద్దీ జ్ఞానం లేదనాలి.  పైగా తూటాలు కూడా లోడ్ చేసిన రైఫిల్ పిల్లల చేతికిచ్చారంటే ఎంత ఘోరం?

ప్రాణం తీసిన ఆట

కెంటకీ సమీపంలోని బర్కస్ విల్లేలో జరిగిన ఘటన చూస్తే అగ్రరాజ్యంలో తుపాకీని ఎంత అరాచకంగా వాడుతున్నారన్నది తెలుస్తుంది. తల్లి ఏదో పని చేసుకుంటూ ఇంటి బయటికి వెళ్లింది. ఇంట్లో రెండేళ్ల పాప, ఐదేళ్ల బాబు ఆడుకుంటున్నారు. తల్లి అటుగా వెళ్లిన నిమిషాల వ్యవధిలోనే దారుణం జరిగిపోయింది. ఆ అన్న రైఫిల్తో చెల్లెలి చాతీభాగం మీద ఒకే రౌండు కాల్చాడు. అంతే ఆస్పత్రికి తరలించేలోగానే పాప ప్రాణం పోయింది. ఈ దారుణ ఘటనలో ఎవరిని తప్పుబట్టాలి? ఆయుధానికి, ఆటబొమ్మకీ తేడా తెలియని ఆ చిన్నారిని తప్పుపట్టగలమా? ఆయుధాన్ని ఆటబొమ్మలా అందుబాటులో ఉంచిన పేరెంట్స్ ను తప్పుపట్టాలా? అసలు పిల్లలకు ఆయుధాన్ని బహుమతిగా ఇచ్చిన ఆ పెద్ద మనిషిని తప్పుబట్టాలా? అసలు అడ్డూఆపూ లేకుండా తుపాకులు తయారు చేస్తున్న కంపెనీలను నిందించాలా? గన్ కల్చర్ ను కంట్రోల్ చేయలేకపోతున్న అమెరికా చట్టాలను వేలెత్తి చూపాలా?

2 comments:

జలతారు వెన్నెల said...

ఇంకా ఎన్నో దారుణాలు జరిగాయండి ఈ రైఫిల్స్/గన్స్ వలన..
గన్ కంట్రోల్ బిల్ల్ కూడా పాస్ అవ్వలేదు సెనేట్లో !

nihar said...

జలతారు వెన్నెల గారూ... చూశారా ఇన్ని దారుణాలు జరుగుతున్నా అగ్రరాజ్యమే ఏమీ చేలేకపోతోంది. చైనా టాయిస్ కంపెనీల పుణ్యమాని మన దగ్గరకూడా డేంజరస్ గన్స్ మార్కోట్లోకి వచ్చేశాయి. వీటితో పిల్లలకు ఎంతో ప్రమాదం.. మనం జాగ్రత్త పడటం తప్ప ఇంకేం చేయగలం!... మీరైనా స్పందించారు థాంక్... నిహార్