Tuesday 21 May 2013

చదువంటే కీబోర్డు...మానిటరు!

వాహ్... యంగ్ ఎచీవర్!
'ఎప్పుడూ ఆ కంప్యూటర్ ధ్యాసేనా... కాసేపైనా కష్టపడి చదివితే జీవితంలో పైకొస్తావ్...' ఎప్పుడైనా పిల్లల విషయంలో మీ నోటి వెంట ఈ డైలాగ్ వచ్చిందా? ఇంకెప్పుడూ రిపీట్ కానీవకండి. మీ అబ్బాయి లేదా అమ్మాయికి కంప్యూటర్ మీద అంత ఆసక్తి ఉంటే ఏనాటికైనా డేవిడ్ కార్ప్ అయ్యే ఛాన్సొస్తుంది. జీవితంలో పైకెదగాలంటే చదువే అవసరం లేదు, ఏ రంగంలో ఆసక్తి ఉన్నా చాలు... అని నిరూపించిన యంగ్ అచీవర్ అమెరికాకు చెందిన డేవిడ్ కార్ప్.

యాహూలో టంబ్లర్ విలీనం

కనీసం హైస్కూల్ చదువైనా లేని 26 ఏళ్ల డేవిడ్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యాహూ కంపెనీనే మెప్పించగలిగాడు. అదే డేవిడ్ స్థాపించిన పాపులర్ బ్లాగింగ్ సర్వీస్ ప్రొవైడర్... టంబ్లర్(Tumblr). కంప్యూటర్ సాఫ్ట్ వేర్లు, ప్రోగ్రామింగ్, వెబ్ డిజైనింగ్ వ్యవహారాల్లో నిపుణుడైన డేవిడ్ ఆరేళ్ల క్రితం అంటే ఇరవై ఏళ్ల వయసులో ఈ టంబ్లర్ బ్లాగింగ్ సర్వీస్ మొదలెట్టాడు. దీన్ని యాహూ కంపెనీ నూటాపది కోట్లు వెచ్చించి తాజాగా విలీనం చేసుకుంది. ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగిన డేవిడ్ జీవితంలో బిగ్ సక్సెస్ సాధించాడు.

అమ్మ చెప్పిన మాట...

డేవిడ్ సక్సెస్ వెనుక ఉన్నదెవరో కాదు... అమ్మ. పధ్నాలుగేళ్ల వయసులో చదువంటే బోర్ అంటున్న కొడుకును ఆమె మందలించలేదు. బలవంతంగా పుస్తకం చేతులో పెట్టి చదువుకోమ్మంటూ బెత్తం పట్టుకుని పక్కనే కూర్చోలేదు. బోరుకొడితే బుక్ రీడింగుకు గుడ్ బై చెప్పేయ్... నీకు ఆసక్తి ఉన్న ఆ కంప్యూటర్తోనే ఏదైనా సాధించేందుకు ట్రై చేయ్... అంటూ ఎంకరేజ్ చేసింది. స్కూల్లో సైన్సు పాఠాలంటే విసుగుచెందిన డేవిడ్... బెడ్ రూమ్లో తన కంప్యూటర్తో విసుగూవిరామం లేకుండా కసరత్తు చేసేవాడు. పధ్నాలుగేళ్లలో మొదలైన ఆ తపన 20 ఏళ్ల వచ్చేప్పటికి ఓ కంపెనీ ఓనరును చేసింది. మరో ఆరేళ్లు తిరిగేలోపు అదృష్టమే మారిపోయింది.

చదువొక్కటే కాదు...

చదువంటే పెద్దగా ఆసక్తిలేని కొడుకులో ఇన్నర్ టాలెంట్ ఉందని గుర్తించిన అమ్మ... కంప్యూటర్ రంగంలో ఆకాశానికి ఎదిగేలా ప్రోత్సహించింది. నిజంగా 'చదువు... చదువు' అంటూ అనుక్షణం పోరుపెట్టే తల్లులకు డేవిడ్ కథనం కనువిప్పు. అయితే ఏ అమ్మయినా తన బిడ్డ బాగా చదివి జీవితంలో పైకెదగాలనే కోరుకుంటుంది. కొంత మంది పిల్లలు ఎందుకోగానీ చదువు మీద ధ్యాస పెట్టలేకపోతారు. అలాంటి వారిలో మరేదైనా నైపుణ్యం ఉందేమో గమనించి ప్రోత్సహించాల్సింది తల్లిదండ్రులే. అలాకాకుండా కేవలం చదువొక్కటే మనిషిని నడిపిస్తుందనే గుడ్డినమ్మకంతో పిల్లల మీద ఒత్తిళ్లు పెంచితే చెడు తప్ప మంచెలా జరుగుతుంది? 'టంబ్లర్'తో అద్భుత విజయం సాధించిన డేవిడ్, ఆ విజయం వెనుక ఉన్న ఆ అమ్మ మనందరికీ మార్గదర్శకులు.    
 

2 comments:

జలతారు వెన్నెల said...

చదువంటే ఆసక్తి లేని పిల్లలు కోకొల్లలు. అందరు డేవిడ్ లా సాధించలేరు కదా? We cannot generalize.

nihar said...

చదువంటే ఆసక్తిలేని కోకొల్లల్లోనూ అంతర్లీనంగా ఏదో ఒక టాలెంట్ ఉంటుందనేది కాదనలేని నిజం. దాన్ని గుర్తించి ఆ దిశగా పిల్లల్ని ప్రోత్సహించడం ఎంతో అవసరం. అందులో కొందరైనా డేవిడ్ తరహా చాకులాంటి కుర్రాళ్లు వెలుగులోకి వస్తారుకదా...?...ఏనీఔ థ్యాంక్యూ జలతారువెన్నెల గారూ...