Friday 17 May 2013

కోటీ కాలిగోటితో సమానమే!

ఆటోవాలా జిందాబాద్!
నిజంగా మనచుట్టూ మోసగాళ్లు ఏ కొంతమందో ఉంటారు. కానీ ఒకటి అరా చేదు అనుభవాలతోనే మనం కనిపించిన ప్రతివాడినీ మోసగాడేనేమో అని అనుమానించాల్సి వస్తోంది.  కానీ మనిషిలో ఇంకా నిజాయితీ మిగిలే ఉందని చాటాడు ఓ సాదాసీదా ఆటోరిక్షా కార్మికుడు. ఓ సంపన్నుడు తన యావదాస్థిలో సగం పేద వారి సంక్షేమానికి దారాదత్తం చేసేస్తున్నానని ప్రకటించినా ఆ.. ఏముందిలే అనిపిస్తుంది. ఈ పేద రిక్షా కార్మికుడి దాతృత్వం గురించి తెలుసుకుంటే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది.

ఆటో నడుపుకుంటున్న రాజు

కోటీశ్వరుడయ్యే ఛాన్సొచ్చినా...

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు రాజు భర్వాడ్. ఒకరోజు గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నుంచి  కోటీ తొంభై లక్షల రూపాయల చెక్కు చేతికందింది. టాటా నానో ప్లాంటు ఏర్పాటు కోసం సనంద్ అనే ప్రాంతంలో భూమి సేకరించినందుకు గానూ నష్ట పరిహారంగా ప్రభుత్వం అందిస్తున్న సొమ్ము అంటూ ఓ లేఖ కూడా జతచేసి ఉంది. రాజు తల్లి సహ దరఖాస్తుదారుగా అందులో ఉంది. అయితే లేఖ చదివిని రాజు తనది కాని భూమి కోసం పరిహారం ఎందుకు తీసుకోవాలనుకుంటూ చెక్కు తీసుకెళ్లి అధికారులకు ఇచ్చేశాడు. 

నిజాయితీగా బతికేతత్వం

నిజంగా ప్రభుత్వం అందించిన పరిహారం రాజుకు చెందిన భూమి కోసమే. కానీ రాజు తండ్రి పాతికేళ్ల క్రితమే ఆ భూమిని తొమ్మిది లక్షల రూపాయలకు అమ్మేశాడు. కొంతమంది పేదవాళ్లు స్థలం కొనుక్కుని ఇళ్లు కట్టుకున్నారు. అయితే రికార్డుల్లో ఇంకా రాజు, ఆయన తల్లి పేర్లే ఉన్నాయి. కొనుగోలు చేసిన వారి పేరున స్థలాలు బదిలీ కాలేదు. పశ్చిమ బెంగాల్లో ఆందోళనల కారణంగా గుజరాత్ తరలివచ్చిన టాటా నానో కార్ల ప్రాజెక్టును సనంద్ ప్రాంతంలోనే ఏర్పాటు చేశారు. ఇందులో ఒకప్పటి రాజు స్థలం కూడా భూ సేకరణ కింద పోయింది. పరిహారంగా కోటీ తొంభై లక్షలు మంజూరైంది. కానీ నిజాయితీనే నమ్ముకున్న రాజు ఆ చెక్కు తీసకెళ్లి అధికారులకు ఇచ్చేశాడు. ఒకవేళ రాజు ఆ చెక్కును సొమ్ము చేసుకుని ఉంటే ఆయన దగ్గర స్థలం కొనుక్కుని గూడు ఏర్పాటు చేసుకున్న వారంతా నీడ కోల్పోయి రోడ్డున పడతారు. తనలాంటి పేద కుటుంబాలకు ద్రోహం తలపెట్టలేని మంచి మనసు రాజుది. అందుకే తమ దగ్గర స్థలం కొనుక్కున్న పేదల పేరిట రికార్డులు మార్చించేందుకు రాజు చిత్తుశుద్ధితో ప్రయత్నిస్తున్నాడు. ఇది పూర్తయ్యాక ఆ పరిహారమేదో వారికే అందుతుంది. రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యే అవకాశం వచ్చినా నిస్వార్ధంగా వ్యవహరించిన ఈ రిక్షా కార్మికుడు ఆదర్శప్రాయుడు.

మన అక్రమార్కులకు గుణపాఠం

మన దగ్గర ప్రాజెక్టు కట్టాలన్నా, రోడ్డు విస్తరించాలన్నా, ఫ్యాక్టరీ పెట్టాలన్నా బీడు భూముల్లో రాత్రికిరాత్రే గుడిసెలు వెలుస్తాయి. అధికారులకు, ప్రజాప్రతినిదులకు కోట్లు ముడతాయి. పక్కా ఇళ్లున్నట్లు రికార్డులు సిద్ధమవుతాయి. ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయలు తరలిపోతాయి. ఇంతాచేస్తే నిజమైన నిర్వాసితుడికి చిల్లిగవ్వ కూడా దక్కదు. బినామీలు, దళారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు సర్కారు సొమ్మంతా అప్పనంగా నొక్కేస్తారు. ఇలాంటి అవినీతి, అక్రమాల వల్లే ఏ ప్రాజెక్టు వ్యయమైనా భూసేకరణ దగ్గరే బడ్జెట్ ను మించిపోతోంది. దాంతో నిధులు వెచ్చించలేని పాలకులు పనులు ముందుకు కదలకుండా చేతులెత్తేస్తుంటారు. ఇలాంటి అవినీతి వ్యవహారాలకు పాల్పడే దుష్టులను బహిరంగంగా ఉరి తీసే రోజులు రావాలి. రాజు లాంటి ఆటో డ్రైవర్ నిజాయితీని చూసైనా సర్కారు ఖజానాను దిగమింగుతున్న దొంగలు బుద్ధి తెచ్చుకుంటారని ఆశించడం అత్యాశే. 

నిస్వార్థమే తరగని ఆస్తి

భూమి విషయంలోనూ రాజు నిజాయితీగా వ్యవహరించాడు. ఎప్పుడో అమ్మేసిన భూమి రికార్డులు ఇంకా తన పేరునే ఉన్నాయంటే ఎగిరిగంతేసే వారు ఇతరులెవరైనా. హైదరాబాద్ మొదలు రాష్ట్రంలోని మారుమూల పల్లెదాకా ఎక్కడ చూసినా భూముల తగాదాలే. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు భూముల విలువ వందల రెట్లు పెరిగిపోవడంతో అన్నాదమ్ముల మధ్యే పేచీలు తలెత్తుతున్నాయి. వేరే వాళ్లకు అమ్మేసుకోవడం, దొంగ రికార్డులతో మళ్లీ చేజిక్కించుకోవడం... నేరాల్లో సగానికి పైగా భూతగాదాల కారణంగానే అనేది నిజం. మన రెవిన్యూ, పోలీసు శాఖలు చేస్తున్న ముప్పావు వంతు పని భూ పంచాయితీలు సెటిల్ చేయడమే. భూమికే ఇంత విలువ లేకపోతే ఫిర్యాదులుండవు, పంచాయితీలుండవు, నేరాలూ ఉండవు. కనీసం రాజు లాగా మనిషి అన్నవాడిలో కొంతైనా నిజాయితీ ఉంటే లోకం సుభిక్షంగానే ఉంటుంది. అందుకే రాజులాంటి వారెక్కడ కనిపించినా అభినందించాలి. అలాగే నిజాయితీగా బతికేందుకు మనమంతా అండదండ అందివ్వాలి. నిజాయితీవాలా జిందాబాద్...!  ఇంతకీ రాజు ఆటో నడిపితే వచ్చే ఆదాయమెంతో తెలుసా... నెలకు ఆరువేల రూపాయలు. తన కుటుంబం సంతృప్తిగా బతికేందుకు ఇదే చాలని చెప్పడం చాలా గొప్ప విషయమే. 

2 comments:

జలతారు వెన్నెల said...

రాజు భర్వాడ్ కి చేతులెత్తి నమస్కరించాలి.తనకు వచ్చిన డబ్బు వలన,ఇంకొన్ని కుటుంబాలు రోడ్డున పడతాయి కాబట్టి, ఆ డబ్బు ని తిరస్కరించడమే కాక,ఆ పేదవారి పేరున భూమి రికార్డులు మార్పించడానిటికి అతను చేస్తున్న కృషి --మనుషులలో దైవత్వం అంటే ఇదే!

nihar said...

జలతారువెన్నెల గారూ కృతజ్ఞతలు... మంచితనమున్న మనుషులు అరుదుగా కనిపిస్తారు. ఈమధ్య మహబూబ్ నగర్ కుర్రాడికి ఏకంగా డెబ్బై కేజీల బంగారం పెట్టి దొరికినా నిజాయితీగా పోలీసులకు అప్పగించేశాడు. అరుదుగా ఉండే ఇలాంటి వారిని అభినందిస్తే మరికొందరు ఈదోవలో అడుగుపెట్టాలనుకుంటారు. ఏనీవే రాజులో దైవత్వం కనిపించిందన్నారుగా థాంక్స్... నిహార్