Tuesday 21 May 2013

ఎవరెస్టే చిన్నబోయెనా...!

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి!

అరుణిమా సిన్హా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. "వాహ్! సాహసం చేసింది' అని ఒక్కమాటలో వదిలేయలేం. ఈ సాహసంలో ఓ విషాదగాధ ఉంది... కఠోరసాధన ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ను మొదటి మహిళ బచేంద్రిపాల్ మొదలు చాలా మంది ఎక్కేసి ఉండొచ్చు. కానీ అరుణిమా సిన్హా విజయంలో ఓ స్ఫూర్తి ఉంటుంది. ఆమె కృత్రిమ కాలితో ఎవరెస్ట్ అధిరోహించిన మొదటి మహిళ. కేవలం రికార్డు సృష్టించడానికే అరుణిమ ఈ లక్ష్యాన్ని ఎంచుకోలేదు. అణచివేతకు గురవుతున్న మహిళల్లో దైర్యం నింపడానికే ఇంత పెద్ద సాహసం చేసింది. 

 

నిజంగా అరుణిమ జీవితం ఉవ్వెత్తున ఎగసిపడిన కెరటం. ఎగసినప్పుడు ఆత్మవిశ్వాసం కనబరచింది. అలాగే పడిపోయినప్పుడూ ఆమెలో విశ్వాసం సడలిపోలేదు. ఉత్తర ప్రదేశ్ అంబేద్కర్ నగర్ కు చెందిన అరుణిమ జాతీయ స్థాయి మహిళా వాలీబాల్ జట్టులో ప్లేయర్. ఆటల్లో అజేయంగా దూసుకుపోతున్న తరుణంలో ఆమె జీవితంలో చీకట్లు కమ్ముకున్నాయి.

2011లో లక్నో నుంచి ఢిల్లీ వెళ్తుండగా పద్మావతి ఎక్స్ ప్రెస్ జనరల్ కంపార్ట్మెంట్లో దొంగలు తారసపడ్డారు. అరుణిమ మెడలో గొలుసు లాగేసుకుని పారిపోతుండగా దైర్యం చేసి దొంగలను ఎదిరించింది. ఆ పెనుగులాటలో దొంగలు ఆమెను రైలు కిందకి తోసేశారు. తీవ్రంగా గాయపడిన అరుణిమ... కుడికాలు పోగొట్టుకుంది. ఈ విషాదం గురించి తెలిసిన ఎందరో ఆమెను వ్యక్తిగతంగా కలిసి దైర్యం చెప్పారు. క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా లక్ష రూపాయలు సాయం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకూడదని భుజంతట్టి చెప్పాడు. ఆ మాటలే అరుణిమను బతికించాయి. క్యాన్సర్ తో పోరాడిన యువరాజ్ సింగ్ చికిత్స తర్వాత కోలుకుని మునుపటి ఉత్సాహంతోనే మళ్లీ పిచ్లో అడుగుపెట్టడం అరుణిమకు స్ఫూర్తి నింపింది. 

 

ఏదో వికలాంగురాలిగా బతుకీడ్చడం కాదు... జీవితంలో ఏదైనా సాధించి తనపై రైల్లో అమానుషంగా ప్రవర్తించిన దుండగులకు గుణపాఠం చెప్పాలనే కంకణం కట్టుకుంది. అనుకున్నదాన్ని సాధించడానికి కఠోర శ్రమ చేసింది. అనుకున్నట్లుగానే కృత్రిమ కాలితోనే ఎవరెస్ట్ అధిరోహించి రికార్డు నమోదు చేసింది. స్వతహాగా క్రీడాకారుడైన సోదరుడు అండగా నిలబడ్డాడు. మహోన్నత లక్ష్యాన్ని సాధించడానికి టాటా స్టీల్ ఎడ్వంచర్ ఫౌండేషన్ తోడ్పడింది. ఈ ఫౌండేషన్ చీఫ్ గా వ్యవహరిస్తున్న బచేంద్రిపాల్... అరుణిమకు అడుగడుగునా ఊతమందించింది. ఎవరెస్ట్ ఎక్కిన మొదటి మహిళగా బచేంద్రిపాల్ అన్ని విధాలా సహకరించడంతో అరుణిమ కృత్రిమ కాలితో ఎవరెస్ట్ అధిరోహించిన తొలిమహిళగా నిలిచింది. జీవితంలో విషాదం నిండిందని దిగులుపడకుండా కొత్త వేకువ కోసం కోటి ఆశలతో ఎదురుచూడడం మంచిదంటుంది ఈ సాహసి.   

2 comments:

జలతారు వెన్నెల said...

Kudos to her! Real brave soul.

nihar said...

థ్యాంక్యూ జలతారువెన్నెల గారూ... అరుణిమ లాంటి సాహసికులకు జోహార్లు అర్పించాల్సిందే