Monday, 6 May 2013

ఓ ప్రేమమహల్ నిర్మాణానికి...!

వాహ్ తాజ్...! 

గుండెల్లో దాచుకోలేని ప్రేమ!

తాజ్ మహల్ ఎవరు నిర్మించారని ఎవరైనా అడిగితే నేను మాత్రం ఫైజల్ హస్సన్ ఖాద్రీ పేరు చెప్తాను. ఇంతకీ ఈ ఆధునిక షాజమాన్ ఎవరని మీరడిగితే ఈ పోస్టు చదవండి.
ముంతాజ్ ప్రేమకు చిహ్నంగా ఆగ్రాలో సుందర పాలరాతి కట్టడం తాజ్ మహల్ నిర్మించాడు షాజహాన్. ఆ హృదయాంతరాల్లో దాగిన ప్రేమను వర్ణించలేం... అలాగే అందరి హృదయాలనూ కొల్లగొట్టే తాజ్ మహల్ సౌందర్యాన్నీ వర్ణించలేం. ముంతాజ్ సతీ సమాధి సమీపాన షాజహాన్ నిదురించినట్లుగా తన భార్య సమాధి పక్కనే శాశ్వత నిద్రలోకి జారుకోవాలని కోరుకుంటున్నాడు మరో షాజహాన్.

బులంద్ షహర్ లో 'తాజ్ మహల్'

ఆ ఆధునిక షాజహాన్ బులంద్ షహర్ కు చెందిన రిటైర్డ్ పోస్టు మాస్టర్ ఫైజల్ హసన్ ఖాద్రీ. 77 ఏళ్ల వృద్ధాప్యంలోనూ ఫైజల్ హస్సన్ తన దివంగత భార్యంటే ఎనలేని ప్రేమ చూపిస్తాడు. 2011 డిసెంబర్ లో మరణించిన భార్య బేగం తాజ్ ముల్లి జ్ఞాపకార్ధం ఈ ప్రేమికుడు 'తాజ్ మహల్' నిర్మాణానికి కంకణం కట్టుకున్నాడు. రాజులకే కాదు పేదవాడికీ ప్రేమంటే ఏమిటో తెలుసు. ప్రేమకు చిహ్నంగా అందమైన కట్టడాలూ నిర్మించగలరని నిరూపించాడు. అచ్చం షాజహాన్ నిర్మించిన తాజ్ మహల్ మాదిరిగానే కనిపించేలా ఐదువేల చదరపుటడుగుల వైశాల్యంలో నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇప్పటి దాకా ఇరవై లక్షలు ఖర్చుపెట్టాడు. రిటైర్మెంటుతో వచ్చిన డబ్బుంతా ఈ జ్ఞాపక చిహ్నానికే వెచ్చిస్తున్నాడు. ఇక పాలరాయి తాపడాలు వేయించడమొక్కటే మిగిలింది. చుట్టూ ఎకరా స్థలంలో అందమైన ఉద్యానవనాలు పెంచాలనేది సంకల్పం. ఇది కూడా సాధ్యమైనంత త్వరలోనే పూర్తి చేయగలనన్నది ఆయన ధీమా. ఈ సుందర కట్టడం మధ్యలోనే భార్య తాజ్ ముల్లి సమాధి ఉంది. తాను కన్నుమూశాక తన సమాధి కూడా ఆ పక్కనే కట్టాలనేది ఫైజల్ హస్సన్ కోరిక. ఇదే వీలునామాలోనూ రాసిపెట్టుకున్నాడుట. ఫైజల్ హస్సన్ ఖాద్రీ ప్రేమను చూస్తుంటే "సుందరకాండ"తో ప్రసిద్ధులైన శ్రీ ఎమ్మెస్ రామారావు "నీరాజనం" సినిమాలో పాడిన ఓ పాట గుర్తుకొస్తుంది.


ఈ విశాల... ప్రశాంత... ఏకాంత సౌధంలో...
నిదురించు జహాపనా...
పండు వెన్నెల్లో వెండి కొండల్లే
తాజ్ మహల్ దవళా కాంతుల్లో
నిదురించు జహాపనా...
నీ జీవిత జ్యోతీ నీ మధుర మూర్తి
ముంతాజ్ సతీ సమాధి సమీపాన
నిదురించు జహాపనా...


నిజంగా భార్య మీద ప్రేమున్న భర్తలు తాజ్ మహల్ లాంటి జ్ఞాపక చిహ్నాలే నిర్మించనక్కరలేదు. చెరగని చిరు నవ్వు కానుకగా ఇచ్చినా చాలు. మన ఆడవాళ్లలో చాలా మంది గోరంతతోనే సంతృప్తి చెందే ముంతాజ్ బేగంలే కనిపిస్తారు.  

2 comments:

జలతారు వెన్నెల said...

ఖర్మ! ఆ ఇరవై లక్షలేవో తన భార్య పేరున సేవా కార్యక్రమాలలోనే, అనాధలను ఆదుకొని వారికి ఒక జీవన విధానాన్ని కల్పించటంలోనే ఉపయోగిస్తే ఎంత బాగుండేది?

nihar said...

జలతారువెన్నెల గారూ... బాగా చెప్పారు. కానీ సేవ పేరుతో ఎంత చేసినా తగిన ప్రచారం రాదుకదా. కొందరికి ప్రచారం కావాలి మరి. ఆ రోజుల్లో షాజహాన్ కూడా నలుగురి మెప్పూ పొందేందుకే తాజ్ మహల్ నిర్మించి ఉండవచ్చు. మన ఫైజల్ కూడా ప్రచారం కోసమే పాకులాడుతూ ఉండవచ్చు. భార్య మీద నిజమైన ప్రేమ కూడా చూపిస్తుండవచ్చు. మొత్తానికి స్పందించినందుకు కృతజ్ఞతలు.... నిహార్