Friday 10 May 2013

మనిషి, కుక్క...'డోగా'!

శునకానికి రాజయోగం 'డోగా'!

భారతీయ రుషులు, మునులు కఠోర సాధన చేసి యోగా, ధ్యానం లాటి ప్రక్రియలను ప్రపంచానికి పరిచయం చేస్తే... ప్రపంచదేశాల్లో కుక్కలతో శారీరక వ్యాయామాలు డిజైన్ చేసి దానికి  గొప్పగా 'డోగా' అని పేరుపెట్టడం విడ్డూరమే.

 డోగా అంటే కుక్కతో కలిసి మనిషి చేసే యోగా! ఎంత విపరీతం?! క్రీస్తుపూర్వం 2500 సంవత్సరాల నాటిది భారతీయ యోగా. హిందూ జీవనవిధానంతో ముడిపడిపోయిన సాంప్రదాయ విద్యావిధానం ఇది. ఇలాంటి యోగాకు కుక్కను జతచేసి...ఒక్క అక్షరం మార్పుతో 'డోగా'గా ప్రచారం చేస్తూ  సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి?

 శునక మహారాజ పోషకులు

అమెరికా, స్పెయిన్ లాంటి దేశాల్లో డోగా ట్రైనర్లకు మంచి గిరాకీ ఉందిట!. కోస్టారికాలోని సాన్ జోస్ లో ఈ డోగా యమా పాపులర్ అయిపోయింది. మెర్సెలా క్యాస్ట్రో అనే 29 ఏళ్ల యువతి 'డోగా' విద్యకు గురువుగా మారింది. మూడేళ్లుగా ఓ పార్కులోనే మెర్సెలా క్యాస్ట్రో సుమారు వంద మందికి  'డోగా' క్లాసులు చేప్తోంది. యోగాభ్యాసంతో ఒక్క మనిషికే ఎక్సర్ సైజ్ అవుతుంది. అదే డోగా అనుకోండి మనషితో పాటు కుక్కకు కూడా వ్యాయామమే. అందుకే యోగా కన్నా డోగా ముద్దనుకుంటూ శునక మహారాజ పోషకులంతా తమ పెట్ డాగ్స్ ను వెంటబెట్టుకుని మెర్సెలా క్యాస్ట్రోను వెతుక్కుంటూ పార్కు బాట పడుతున్నారు. ఈ మోడ్రన్ డోగా మాస్టారుని వ్యాయామ గురువుగా మార్చేసుకుంటున్నారు! 

 అభ్యాసం కూసు విద్య!

ఈ డోగా ప్రక్రియేంటంటే- మనం నేల మీద పడుకుని పెంపుడు కుక్కను  మన కాళ్లూచేతులతో అమాంతం పైకెత్తేయడమే. ఇలా పైకీ కిందకీ కుక్కను ఎత్తిదింపుతూ ఉంటే మన కాళ్లకీ, చేతులకీ ముఖ్యంగా వెన్నెముకకి మంచి వ్యాయామం అవుతుందని డోగాను పాపులర్ చేస్తున్న మెర్సెలా క్యాస్ట్రో లాంటి వారి సెలవిస్తున్నారు. ఇలాంటి వ్యాయామ భంగిమలు చాలానే ఉన్నాయి. చేసుకున్నోడికి చేసుకున్నంత అన్న చందంగా! మనకి నచ్చాలి... అందుకు కుక్క కూడా సహకరించాలి. ఎవరికైనా డోగా ప్రాక్టీసు చేయాలనిపిస్తే ఇందులో నైపుణ్యమున్న డోగా ట్రైనర్ సలహాలు, సూచనలు తీసుకోండి. నిపుణుల పర్యవేక్షణలోనే అభ్యాసం చేయండి. ఆతృతపడి ఏదైనా చేసే ముందు కుక్కతో వ్యవహారం కదా... కాస్త జాగ్రత్తగా ఉండండి. అభ్యాసం చేస్తూపోతే ఏదో ఓ నాటికి మీరే డోగా మాస్టరైపోవచ్చు. అభ్యాసం కూసు విద్యా అన్నారు కదా!

 కుక్క బుద్ధి మారి 'గుడ్' డాగ్ అవుతుందిట!

డోగా మన శరీరానికి ఎంత మేలు చేస్తుందో కుక్కకీ అంతే మేలు చేస్తుందిట! పైగా చీటికీమాటికీ అందరిమీదా కయ్ కయ్యిమని అరిచే కుక్కల 'వంకర బుద్ధి'లో గుణాత్మక మార్పూ కనిపిస్తోందిట! డోగాభ్యాసం చేస్తున్న శునకాలు(అవి చేయవు లెండి... మనమే చేయిస్తాం) బుద్ధిగా జీవిస్తున్నాయని కితాబులు కూడానూ! కోస్టారికాలోనే కాదు న్యూయార్క్, ఫ్లోరిడా నగరాల్లోనూ డోగా మాస్టర్లున్నారు. పదేళ్ల నాడే డోగాభ్యాసం మొదలైంది. క్యాష్ చేసుకోవడం తెలిసిన మాస్టర్లు దీనికి తెగ పాపులారిటీ తీసుకొస్తున్నారు. మనిషికి, మూగజీవికీ ఆరోగ్యం, వ్యాయామం అవసరమన్నది గుర్తించి దీన్నే మార్కెట్ చేసుకుంటున్నారు.

 కుక్కే మాస్టర్...!

ఇంతకీ మెర్సెలా క్యాస్ట్రో డోగా విద్యానెలా కనిపెట్టారనేది తెలుసుకోవాలన్న ఆసక్తి ఎవరికైనా కలగవచ్చు! ఒకప్పుడు ఆమె యోగా నేర్చుకునేందుకు వెళ్తూ తోడుగా పెంపుడు కుక్కను వెంట తీసుకువెళ్లేదిట! ఓనరుగారి వ్యాయామాలన్నీ కనిపెట్టిన ఆ కుక్క తాను కూడా నేర్చేసుకుందిట. రోజువారీ ఎక్సర్ సైజ్  కోసం పెట్ డాగ్ కు వేరేగా టైమ్ కేటాయించలేక సతమతమవుతున్న మెర్సెలా క్యాస్ట్రోకు తట్టిన అద్భుత ఐడియా డోగా! ఆ విద్యే మెర్సెలా క్యాస్ట్రోకు జీవనోపాధిగా మారింది. ఇది చదివాక ఆరోగ్యం మీద ధ్యాస మళ్లిందా? అయితే వ్యాయామం చేయండి. 'డోగా' కాదు, 'యోగా'!. మన యోగాను మించిన ఆరోగ్యకరమైన వ్యాయామం ఈ ప్రపంచంలోనే లేదు. అంతగా మీ కుక్కకీ వ్యాయామం కావాలంటే దాన్ని చేసుకోమనండి 'డోగా'. ఈ మాయదారి ప్రపంచంలో 'డోగా' రానురానూ పాపులర్ అయిపోయిందంటే భారతీయ 'యోగా'కు తలవంపులే. ఆ పరిస్థితి రానీయకుండా చూడాల్సింది మనమే!

2 comments:

Anonymous said...

Interestingగా ఉంది కానీ, మా స్నూపీ గాడు అస్సలు బుద్ధిమంతుడుకాడు.

nihar said...

థాంక్స్ అనూ గారు... మీ స్నూపీ గాడిని డోగా క్లాసుకు పంపించండి. దెబ్బకి దారిలోకి వస్తాడు... నిహార్