చెరిగిపోని నవ్వులు20 Sept, 1924 - 21 Jan, 2014 |
కృష్ణాజిల్లా గుడివాడ తాలూకాలోని వెంకటరాఘవపురంలో (ప్రస్తుతం రామాపూరం) 1924 సెప్టెంబర్ 20న పున్నమ్మ, వెంకటరత్నం దంపతులకు జన్మించారు అక్కినేని నాగేశ్వరరావు. నిజానికి అక్కినేని కుటుంబంలో కళాకారులు లేరు. కళ అనేది దైవదత్తంగా ఆయనకు అబ్బింది. చిన్నతనం నుంచే నాటకల్లో వేషాలు వేసేవారాయన. అక్కినేని ధరించిన తొలి పాత్ర ‘నారదుడు’. వెంకటరాఘవపురంలో పిల్లలందరూ కలిసి వేసిన ‘సత్యహరిశ్చంద్ర’ నాటకంలో పట్టుబట్టి అక్కినేనితో నారద పాత్రను వేయించారు. కారణం ఆ ఊళ్లో ఆయన మంచి పాటగాడు కావడమే. ఆ తర్వాత ఏఎన్నార్ నటించిన పాత్ర చంద్రమంతి. తర్వాత ‘కనకతార’ అనే నాటకంలో తారగా నటించారు. అప్పట్నుంచీ నాటకాల్లో స్త్రీ వేషాలు విరివిగా రావడం మొదలయ్యాయి. ‘సత్యహరిశ్చంద్ర’ నాటకంలో మాతంగకన్య, ‘భక్తకుచేల’ నాటకంలో మోహిని, ‘సారంగధర’ నాటకంలో చెలికత్తె పాత్ర ఇలా ఖాళీ లేకుండా నాటకాలు వేస్తూ ఉండేవారు. రంగస్థల కళాకారునిగా అక్కినేని తొలి పారితోషికం అర్థరూపాయి. ఆ స్థాయి నుంచి అయిదొందలు తీసుకునే స్థాయికి ఎదిగారు. అమ్మ, అన్న ప్రోత్సాహం వల్లే రంగస్థలంపై రాణించగలిగానని చెబుతూ ఉండేవారు అక్కినేని. అప్పట్లో అక్కినేని కుటుంబానికి ఓ పాతిక ఎకరాలు పొలం ఉండేది. అందుకే ఆయన్ను అందరూ చిన్నదొర అంటుండేవారు. కలిగిన కుటుంబంలో పుట్టినా... డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారాయన. ప్రతి ఏడాదీ కుప్పనూర్పిళ్ల సమయంలో... పొలంలో కష్టపడితే ఓ పావలా వచ్చేది. ఆ డబ్బుతో దాపుడు చొక్కా కొనుక్కునేవారు. భజనల్లో గెంతడాలు, కోలాటాలు ఆయనకు చాలా ఇష్టం. ఆ విధంగా చిన్నతనం నుంచే అక్కినేనికి తాళజ్ఞానం అలవడింది. ఇప్పుడు నడుస్తున్న డాన్స్‌ల ట్రెండ్‌కి బీజం అక్కడ పడిందనమాట. సినిమాల్లో డాన్సులు వేయాలంటే తొలితరంలో అక్కినేనికే చెల్లు అని తెలుగు ప్రేక్షకులంతా మెచ్చుకునేవారు.
No comments:
Post a Comment