Monday, 10 February 2014

ఆడపిల్లల చదువే నోబెల్‌ బహుమతి

నా లక్ష్యం నోబెల్‌ శాంతి బహుమతి కాదు, 

పిల్లలందరికీ విద్య, శాంతి...


మత ఛాందసాన్ని నిలువెల్లా నింపుకున్న పాకిస్తాన్‌లో పుట్టిన మలాలా యూసఫ్‌జాయ్‌ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. యోధులు చేయలేని పని చేస్తూ సాహసానికి మారుపేరుగా నిలిచింది. ఏదో ఓ రోజు చావాల్సిందేనని తెగేసి చెబుతూ బాలికల హక్కులు కోసం గొంతెత్తుతోంది. 2012లో మలాలా యూసఫ్‌జాయ్‌ మీద పాకిస్తాన్‌లో తాలిబన్‌లు విరుచుకుపడ్డారు. బడికెళ్లి వస్తున్న ఆమెపై అత్యంత క్రూరమైన దాడి జరిపారు. ఆ అనాగరిక చర్యను చూసి ప్రపంచమంతా కలవరపడింది. మలాలా ప్రాణాలకు ఏ ముప్పూ రాకూడదని ప్రపంచ ప్రజలంతా కాంక్షించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మలాలా చివరకు బ్రిటన్‌ ఆస్పత్రిలో కోలుకుని, అక్కడే చదువుకుంటోంది. ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న సమయంలోనూ ప్రతి ఆడపిల్ల చదువుకోవాలని మలాలా గొంతెత్తి నినదించింది. మలాలా చైతన్యానికీ, సాహసానికీ అంతర్జాతీయ సమాజం అబ్బురపడింది. ఐక్యరాజ్య సమితి ఆమె సాహసాన్ని గుర్తించి, గౌరవించింది. నోబెల్‌ శాంతి బహుమతికి కూడా నామినేట్‌ అయ్యింది. నోబెల్‌ శాంతి బహుమతి వరించకపోయినా బాలల నోబెల్‌ బహుమతి మలాలా సొంతమైంది.

స్వీడన్‌కు చెందిన సంస్థ ప్రతి ఏటా ముగ్గురికి ఈ పురస్కారాన్ని అందిస్తుంది. మొత్తం 15మంది బాలల జ్యూరీ ఈ అవార్డులను ప్రకటించింది. మలాలకు అవార్డు ఇవ్వడంపై జ్యూరీ సంతోషాన్ని వెలుబుచ్చింది. పాకిస్తాన్‌లో బాలల విద్యా హక్కుల కోసం మలాలా చేస్తున్న పోరాటం మరువలేనిదని కొనియాడింది.

No comments: