రాజకీయ కుళ్లును శుభ్రం చేయడం
కుళ్లు రాజకీయాలను
సంస్కరించడానికి సమాచార హక్కు ఉద్యమకారుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారారు అరవింద్
కేజ్రీవాల్. అలాగే అత్యంత వేగంగా ఎన్నికల్లో సంచలనం సృష్టించి ఢిల్లీ ముఖ్యమంత్రి
పీఠమెక్కారు. అయితే అందరూ ఊహించినట్లుగానే కాంగ్రెస్, బీజేపీ రాజకీయాల మధ్య
ఇమడలేకపోయారు. ఎంత సంచలనంగా ఢిల్లీ గద్దెనెక్కారో అంతే సంచలనం సృష్టిస్తూ రాజీనామా
చేశారు. ప్రజాస్వామ్య భారత్లో నయా రాజకీయ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన కేజ్రీవాల్ ప్రభుత్వం ఆయుష్షు 49
రోజులకే చెల్లింది. ఆప్ ఎన్నికల గుర్తు చీపురుకు ఓటేసిన ఢిల్లీ ఓటర్ల ఆకాంక్ష..
అవినీతి నిర్మూలన. దీన్ని నెరవేర్చడానికి కేజ్రీవాల్ మళ్లీ జనంలోకి వచ్చారు.
ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ వ్యవస్థల నుంచి అవినీతిని కూకటి
వేళ్లతో పెకిలించి వేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు 45 ఏళ్ల కేజ్రీవాల్.
హర్యానాకు చెందిన ఈ బనియా(వైశ్యుడు) చాలా మేధావి. కానీ వర్తమాన రాజకీయ కుతంత్రాల
ముందు ఓడిపోయాడు. జనలోక్ పాల్ బిల్లును ఢిల్లీ శాసనసభలో పెట్టినా విపక్ష బీజేపీగానీ,
తన ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారుకు మద్దతునిస్తున్న కాంగ్రెస్ గానీ సహకరించలేదు. దీంతో
అనుకున్న లక్ష్యం నెరవేరలేదన్న ఆవేదనతో ఆప్ సర్కారు చేతులెత్తేసింది.
ఇక ఆమ్ ఆద్మీ నాయకులు ప్రజల్లోకి వెళ్తారు. మళ్లీ ఎన్నికలొస్తాయి. ఈసారైనా కేజ్రీవాల్ టీమ్కు సంపూర్ణ మెజారిటీ వస్తేగానీ జన్ లోక్ పాల్ బిల్లుకు మోక్షం లభించదు. అవినీతి, అక్రమాలతో నిండా మునిగిన ఈ సాంప్రదాయ పార్టీలు ఆమ్ ఆద్మీలాంటి అభ్యుదయ భావజాలమున్న పార్టీలను బతికిబట్టకట్టనిస్తాయా...? పచ్చనోటు, బిర్యానీ పొట్లం, మందు సీసాలతో ఓట్లు కొనుక్కుంటున్న పార్టీలు అధికారం చెలాయిస్తున్న మనదేశంలో ఎన్నికల ప్రక్రియ నిజమైన ప్రజాస్వామ్యానికి అద్దం పడుతుందా...?
సామాన్యుల చేతికి పగ్గాలు వస్తేగానీ ఈ వ్యవస్థలో మార్పు అసాధ్యమన్నది నిజం. ఈ రాజకీయాలు మనకెందుకులే అన్న ధోరణి ప్రబలిపోయిన తరుణంలో నాయకుల తాబేదారులు, రౌడీలు, గూండాలు, ఎందుకూ కొరగాని అలగా జనాలు, అణాకానీ నాయకులంతా ఓట్ల జాతరలో గెలిచేస్తున్నారు.. అధికార పీఠాలెక్కేసి జనం తలరాతలు రాస్తున్నారు. అందుకే కేజ్రీవాల్ లాంటి కొత్త తరహా నాయకులు కావాలని యువత కోరుకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి సరికొత్త ఆలోచనా విధానాన్ని ఆహ్వానిస్తోంది.
హర్యానాలోని ఓ సామాన్య కుటుంబానికి చెందిన కేజ్రీవాల్ సమాచార హక్కు చట్టం అమలు కోసం పోరాటంతో జనంలోకి వచ్చారు. ఇందుకోసం ఐఆర్ఎస్ ఉద్యోగం కూడా వదులుకున్నారు. ఆ తర్వాత 2011లో అన్నా హజారే చేపట్టిన జన్ లోక్ పాల్ ఉద్యమంలో చేరి కీలక పాత్ర పోషించారు. దేశంలో అవినీతి తిమింగాలాల జాబితాలు బయటపెట్టడంతో దేశవ్యాప్తంగా కేజ్రీవాల్ పేరు మార్మోగింది.
అన్నాతో విభేదాలు తలెత్తాక అవినీతి నిర్మూలన అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించారు. యువతరం ఆయనను స్వాగతించింది. మేధావులు, జర్నలిస్టుల మద్దతుతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించారు. షీలా దీక్షిత్ లాంటి ఉద్ధండ నాయకురాలే కేజ్రీవాల్ దెబ్బకు ఓటమి పాలవడం సరికొత్త రాజకీయాలకు తెరలేపింది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కువ సీట్లొచ్చినా కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఎప్పటికైనా కేజ్రీ కాళ్ల కింద చాప లాగేయడానికి హస్తం నేతలు రెడీగా ఉంటారని ఆనాడే ఊహించారు.
ఇక బీజేపీకి ‘ఆప్’ కొరుకుడుపడని కొయ్యలాగానే మారింది. కమలం పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థిగా రంగంలోకి దిగిన నరేంద్ర మోడీ హవాకు ఆమ్ ఆద్మీ అడ్డుపడుతోంది. మోడీ వైపు ఆకర్షితులవుతున్న వర్కింగ్ క్లాస్ ఓటర్లకు.. ముఖ్యంగా యూత్ ఓటర్లకు ఆమ్ ఆద్మీ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. కేజ్రీ పార్టీ తమ విజయావకాశాలకు ఎక్కడ గండికొడుతుందో అన్న భయం పట్టుకుంది బీజేపీకి. అందుకే ఢిల్లీలో ఆప్ సర్కారును ముందు నుంచే ఇరకాటంలో పెట్టేసింది. ఇప్పుడు అనుకున్నదే జరిగింది.
ఇక కేజ్రీ టీమ్ వచ్చే జనరల్ ఎలక్షన్స్ మీద దృష్టి పెడుతుంది. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్టీఏ, కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ కూటములకు ఇది సవాలే. మిగతా చిన్నా చితకా ప్రాంతీయ పార్టీలు జట్టుకట్టి మూడో ప్రత్యామ్నాయంగా అవతరించినా ఆమ్ ఆద్మీ ఉనికిని జనం గుర్తించడం ఖాయం. దేశ రాజకీయాల్లో 20`14 ఎన్నికలు సరికొత్త సంచలనం సృష్టించబోతోందన్నది నిజం. ఈ పరిణామాలన్నీ కేంద్రంలో మరోసారి అస్థిర ప్రభుత్వం వస్తుందేమోనన్న సంకేతం ఇస్తున్నాయి.
----
No comments:
Post a Comment