Monday 26 May 2014

ఉయ్యాలవాడ కథతో చిరు చిత్రం

మెగాస్టార్ చిరంజీవి 150 చిత్రానికి కథ సిద్ధమవుతోంది. గతంలో ‘ఠాగూర్’ సినిమాకు దర్శకత్వం వహించిన వివి వినాయక్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేపట్టనున్నారు. రాంచరణ్ స్వయంగా నిర్మించే ఈ చిత్రం కోసం ఇప్పటికే సాంకేతిక బృందాన్ని ఎంపిక చేశారని టాలీవుడ్ టాక్. రాయలసీమ విప్లవ యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాధ ఆధారంగా పరుచూరి బ్రదర్స్ స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. చిరంజీవి బర్త్ డే రోజైన ఆగస్టు 22 న షూటింగు మొదలెడతారని సమాచారం. సంక్రాంతి సీజన్ కు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడైన చిరు- మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత మళ్లీ సినీ కెరీర్ మీద దృష్టి సారించారు. ఎన్నాళ్లుగానో నూటా యాభయ్యో చిత్రం మీద ఊహాగానాలున్నాయి. అయితే ఇప్పటికి ఆ ప్రతిష్టాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. 2007లో చిరు చివరి సారి పూర్తిస్థాయిలో ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ మూవీలో నటించారు. ఆ తర్వాత రెండేళ్లకు ‘మగధీర’లో ఓసారి కనిపించారు. దాదాపు ఏడేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో మళ్లీ కెమెరా ముందుకొస్తున్నారు. ఇంతకీ సినిమా ఇతివృత్తమేమిటన్నదే ఆసక్తిగా మారింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటీష్ పాలకులను ఎదిరించిన వీరయోధుడు. కర్నూలు ప్రాంతానికి చెందిన ఈ సీమ సింహం కర్నూలు, అనంతపురం, బళ్లారి, కడప తదితర ప్రాంతాల్లోని డెబ్బై గ్రామాలకు సామంతరాజు. స్వాతంత్రానికి పూర్వం నిజాం నవాబు ఈ ప్రాంతాన్ని బ్రిటీష్ వాళ్లకు అప్పగించాడు. దీంతో పన్నులన్నీ బ్రిటీష్ వాళ్లు వసూలు చేసేవాళ్లు. దీన్ని వ్యతిరేకించిన ఉయ్యాలవాడ తెల్లదొరలపై పోరాటానికి సిద్ధపడ్డాడు. సీమ పౌరుషం చూపించి వీరోచితంగా పోరాడిన ఉయ్యాలవాడ చివరికి కొంతమంది నమ్మకద్రోహం కారణంగా ఓటమి పాలవుతాడు. ఆ తర్వాత బ్రిటీష్ పాలకులు కర్కశంగా ఆయన్ని ఉరితీస్తారు. దశాబ్ధాల నాటి ఈ వీరోచిత గాధను సీమ జిల్లాల్లో ఇప్పటికీ చెప్పుకుంటారు. చిరు 150వ చిత్రం ఘనంగా తెరకెక్కాలంటే ఆయనలోని హీరోయిజాన్ని బాగా ప్రొజెక్ట్ చేసేవిధంగా కథాబలం ఉండాలని ఉయ్యాలవాడ గాధను ఎంచుకున్నారు. http://aptopnews.com/life-and-style/647-150

No comments: