ట్రైనీ ఐఏఎస్ లకు టీచరైన మహిళా రైతు!
ఏమీ చదువుకోని ఒకావిడ ఐఏఎస్ ట్రైనింగు పొందుతున్న వారికి టీచరై పాఠాలు చెప్పిందంటే నమ్మగలరా! అవును మెదక్ జిల్లా రాయపల్లి గ్రామానికి చెందిన ఆ మహిళా రైత ఐదల లలితమ్మ. నలభైఐదేళ్ల లలితమ్మ తన జీవితానుభవాల సారాన్ని రంగరించి పాఠంగా చెప్తోంటే ఐఏఎస్ ట్రైనీలంతా మైమరచిపోయి విన్నారుట. ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో లలితమ్మ ఓ రోజంతా టీచర్ అవతారమెత్తారు.
పచ్చని చేనులో ఆదర్శ రైతు లలితమ్మ |
ఆర్గానిక్ పంటలే లాభసాటి
రసాయనిక ఎరువుల, పురుగుమందులు వాడకుండా వ్యవసాయం చేయడంలో లలితమ్మ నిపుణురాలు. నాన్ ఫెస్టిసైడ్ మేనేజ్ మెంట్ మెథడ్స్ గురించి ఆమె... కాబోయే ప్రభుత్వ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లకు పూసగుచ్చినట్లు వివరించారు. ఐదేళ్లుగా తాను అవలంబిస్తున్న వ్యవసాయ విధానాల గురించి వివరించారు. పెట్టుబడులు తగ్గించుకోవడం, దిగుబడులు పెంచుకోవడం లాంటివి చెప్పారు.
ముస్సోరిలో ట్రైనీ ఐఏఎస్ లు (ప్రతీకాత్మక చిత్రం) |
సుమారు పదిహేను రకాల పంటలు పండించే ఈ ఆదర్శరైతు.. వ్చవసాయ రంగంలో ఎన్నో రకాల మెళకువలు స్వానుభవంతో తెలుసుకున్నారు. లలితమ్మ తన పొలానికి కావలిసిన విత్తనాలను ఆమె సిద్ధం చేసుకుంటారు. ఆర్గానిక్ పద్ధతుల్లో ఎరువులు, క్రిమి సంహారకాలు తయారు చేస్తారు. ఆవు పేడ, మూత్రం, వేప ఆకులు... ఇలాంటి అందుబాటులో ఉండే ఆర్గానిక్ మెటీరియల్తో ఎరువులు చేయడం గురించి మిగతా రైతులకూ సలహాలిస్తారు. వానపాములతో సేంద్రీయ ఎరువులు ఎలాచేయాలో ప్రచారం చేస్తున్నారు. సేంద్రీయ పధ్దతుల్లో ఆమె సాధించిన ప్రగతిని కేంద్రం కూడా గుర్తించింది. గతంలో ఢిల్లీలో ఓ అవార్డు కూడా ప్రదానం చేశారు.
ఆర్గానిక్ విత్తనాలు |
సేంద్రీయంతో ఎన్నో లాభాలు
సేంద్రీయ పద్ధతులు అవలంబించడం మొదలెట్టాక వ్యవసాయంలో పెట్టుబడుల భారం తగ్గింది. దిగుబడులు పెరిగి ఆదాయం రెట్టింపైంది. మూడు మాసాలు ఆకుకూరలు పండించిన లలితమ్మ డెబ్బై వేలకు పైగా సంపాదించారుట. రైతు బతుకంటే నిస్సారం, నిస్సహాయత అనుకునే స్థాయి నుంచి పైకెదిగిన లలితమ్మ... వ్యవసాయం లాభదాయకమనేందుకు ఓ ఉదాహరణగా నిలిచారు. స్వీయానుభవం మనకు ఎన్నో మార్గాలు చూపిస్తుంది. విజయం బాటలో నడిచినవారే నలుగురికీ మార్గదర్శిగా నిలబడతారు. అలాంటి మార్గదర్శి లలితమ్మ నాలుగు కాలాలపాటు పచ్చగా ఉండాలని కోరుకుందాం.
సేంద్రీయ పంటలతోనే రేపటి తరం ఆరోగ్యం |
2 comments:
good, every farmer should learn from her.
hariSbabu గారూ బ్లాగు చదివి స్పందించారు థాంక్. ఆలస్యంగా ప్రతిస్పందించినందుకు సారీ. ఇలాంటి రైతులెంతో మంది ఉండగా మన ప్రభుత్వాలు పార్టీ కార్యకర్తలను ఆదర్శ రైతులుగా ఎంపిక చేసి నెలనెలా సర్కారు ఖజానా నుంచి సొమ్ము వృధా చేస్తున్నాయి. ఎంత దారుణం!... నిహార్
Post a Comment